Telugu Global
Andhra Pradesh

జగన్ సర్కారుపై దర్శకేంద్రుడి పరోక్ష చురకలు

సినీ పరిశ్రమకు ఏపీ సర్కారు తగిన మౌలిక వసతులు కల్పిస్తే కచ్చితంగా పరిశ్రమ ఇక్కడికి వస్తుందని దర్శకుడు కె.రాఘవేంద్రరావు అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన పరోక్షంగా విమర్శలు చేశారు. రానున్న రోజుల్లో సినీ పరిశ్రమకు అనుకూల ప్రభుత్వం వస్తుందంటూ ఆకాంక్షించారు.

జగన్ సర్కారుపై దర్శకేంద్రుడి పరోక్ష చురకలు
X

ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు టీడీపీ సానుభూతిపరుడన్న విషయం తెలిసిందే. గతంలో ఆయన టీటీడీ బోర్డు పరిధిలోని ఎస్వీబీసీ ఛానల్ డైరెక్టర్ పదవిని కూడా నిర్వహించారు. ఇదిలా ఉంటే తాజాగా రాఘవేంద్రరావు.. జగన్ సర్కారుపై పరోక్ష విమర్శలు చేశారు. ఏపీలో అధికారంలో ఉన్న ప్రభుత్వం సినీ పరిశ్రమను పెద్దగా పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. సినీ పరిశ్రమకు ఏపీ సర్కారు తగిన మౌలిక వసతులు కల్పిస్తే.. కచ్చితంగా పరిశ్రమ ఇక్కడికి వస్తుందని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన పరోక్షంగా విమర్శలు చేశారు.

రానున్న రోజుల్లో సినీ పరిశ్రమకు అనుకూల ప్రభుత్వం వస్తుందంటూ ఆకాంక్షించారు. జగన్ సర్కారుపై చాలా మంది సినీ పరిశ్రమలోని నిర్మాతలు, పెద్దలకు అసంతృప్తి ఉన్నప్పటికీ పెద్దగా ఎవ్వరూ నోరు మెదపడం లేదు. అధికారంలో ఉన్నవారిపై విమర్శలు చేస్తే ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉందని వారు భావిస్తూ ఉండవచ్చు. కాగా అప్పుడప్పుడూ టీడీపీకి అనుకూలంగా ఉండే కొంతమంది సర్కారుపై విమర్శలు చేస్తూనే ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా రాఘవేంద్రరావు విమర్శలు చేయడం గమనార్హం.

ఇటీవల పట్టభద్రుల, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అనూహ్యంగా గెలవడంతో ఆ పార్టీ నేతలు, సానుభూతిపరుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. చాలా రోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్న నేతలు కూడా యాక్టివ్ అయ్యారు. ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియని గంటా శ్రీనివాసరావు వంటి నేతలు సైతం టీడీపీకి అనుకూలంగా మాట్లాడటం గమనార్హం.

రాఘవేంద్రరావు టీడీపీ సానుభూతిపరుడే అయినప్పటికీ.. ఇప్పటివరకు జగన్ సర్కారుకు వ్యతిరేకంగా పెద్దగా కామెంట్లు చేయలేదు. తాజాగా ఆయన సినీ పరిశ్రమకు ప్రభుత్వం ఏమీ చేయలేదని వ్యాఖ్యానించారు. మొత్తంగా రోజు రోజుకూ టీడీపీకి మద్దతు పెరుగుతోంది. ఇంతకాలం స్తబ్దుగా ఉన్న నేతలు సైతం వెలుగులోకి వస్తున్నారు. మరి టీడీపీ దూకుడును వైసీపీ ఎలా తట్టుకుంటుందో వేచి చూడాలి.

First Published:  26 March 2023 1:06 PM GMT
Next Story