Telugu Global
Andhra Pradesh

17ఏ... ఎవరి గోల వాళ్ళదేనా?

నిజానికి చాలాకాలం సెక్షన్ 17 మాత్రమే ఉండేది. దాని ప్రకారం ప్రజాప్రతినిధుల అరెస్టుకు గవర్నర్ అనుమతి అవసరమేలేదు.

17ఏ... ఎవరి గోల వాళ్ళదేనా?
X

ఇప్పుడు సెక్షన్ 17ఏ అన్నది రాష్ట్రంలో హాట్ టాపిక్ అయిపోయింది. గడచిన 32 రోజులుగా ఈ సెక్షన్‌కు అనుకూలంగా చంద్రబాబు లాయర్లు, వ్యతిరేకంగా సీఐడీ లాయర్లు అనేక కోర్టుల్లో హోరాహోరీగా వాదులాడుతున్నారు. ఏదైనా నేరం చేసినప్పుడు అంటే.. అవినీతికి పాల్పడినప్పుడు ప్రజాప్రతినిధులను అరెస్టు చేయాలంటే 17ఏ ప్రకారం ముందుగా గవర్నర్ అనుమతిని తీసుకోవాలన్నది చంద్రబాబు లాయర్ల వాదన. నిజానికి చాలాకాలం సెక్షన్ 17 మాత్రమే ఉండేది. దాని ప్రకారం ప్రజాప్రతినిధుల అరెస్టుకు గవర్నర్ అనుమతి అవసరమేలేదు.

అనేక కారణాల వల్ల 2018 జూలైలో చట్టాన్ని సవరించి గవర్నర్ అనుమతి తప్పనిసరి చేస్తూ సెక్షన్ 17కి ఏని చేర్చి 17ఏ అంటున్నారు. అయితే ఇక్కడ సీఐడీ వాదన ఏమిటంటే స్కిల్ స్కామ్‌లో జరిగిన అవినీతిపై విచారణ 2016లోనే మొదలైంది కాబట్టి సవరణ చంద్రబాబు అరెస్టుకు వర్తించదని. చట్టానికి సవరణ చేసిన తర్వాత అంటే 2018, జూలై తర్వాత నమోదైన కేసులకు మాత్రమే 17ఏ చట్టం వర్తిస్తుందని సీఐడీ లాయర్లు గట్టిగా వాదిస్తున్నారు. ఇదే విషయమై హైకోర్టులో వాదనలు జరిగినప్పుడు సీఐడీ లాయర్ల వాదననే జడ్జీలు సమర్థించారు.

చంద్రబాబు పిటీషన్‌ను హైకోర్టు కొట్టేయటంతో సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఇప్పుడు ఆ కేసుపైనే విచారణ కొన‌సాగుతోంది. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. చంద్రబాబు కేసులో 17ఏ వర్తించేట్లుంది అని అభిప్రాయం వ్యక్తం చేశారని ఎల్లో మీడియా పెద్ద అక్షరాలతో కథనాలు ఇచ్చింది. సీఐడీ అరెస్టు, విచారణ చెల్లదని జడ్జి అభిప్రాయపడ్డారని రాసుకున్నది. అంటే చంద్రబాబుపై కేసును కొట్టేయటం ఖాయమని ఎల్లో మీడియా చెప్పింది.

ఇదే సమయంలో 17ఏ నిందితులకు వర్తించదని జడ్జి అభిప్రాయపడినట్లు సాక్షి చెప్పింది. ఇక్కడ చట్టం ఏం చెప్పింది అనికాకుండా అవినీతి జరిగిందా లేదా అని మాత్రమే చూడాలని జడ్జి అభిప్రాయపడినట్లు రాసుకుంది. అవినీతిని నిరోధించటమే చట్టం ప్రధాన ఉద్దేశ‌మని మరచిపోకూడదని జడ్జి ఘాటుగా వ్యాఖ్యానించారని చెప్పింది. చట్టం లక్ష్యాన్ని భంగపరిచే వివరణను స్వీకరించలేమని కూడా జడ్జి అన్నట్లు చెప్పింది. దీన్నిబట్టి చంద్రబాబు పిటీషన్‌ను డిస్మిస్ చేయటం ఖాయమన్నట్లుగా సాక్షి తేల్చేసింది. చూస్తుంటే సెక్షన్ 17ఏపై మీడియాలో ఎవరి గోల వాళ్ళదే అన్నట్లుగా ఉంది. చివరకు జడ్జి ఏమని తీర్పిస్తారో చూడాలి.

First Published:  10 Oct 2023 11:23 AM IST
Next Story