Telugu Global
Andhra Pradesh

వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు వైసీపీని ఇరుకున పడేశాయా?

హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి రాత్రి 3 గంటల సమయంలో ఫోన్‌ చేస్తే ఆ సమయంలో నవీన్ ఫోన్ తీసుకెళ్లి భారతీకి ఇచ్చే పరిస్థితి ఉంటుందా అని ప్రశ్నిస్తోంది.

వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు వైసీపీని ఇరుకున పడేశాయా?
X

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారాయి. వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్‌ వద్ద పనిచేసే నవీన్‌కు సీబీఐ నోటీసులు ఇవ్వడంపై స్పందించిన సుబ్బారెడ్డి.. అందులో తప్పేంటి..? అని ప్రశ్నించారు. జగన్‌మోహన్ రెడ్డి ఇంట్లో నవీన్ 15ఏళ్లుగా పనిచేస్తున్నారని.. విచారణకు పిలిస్తే వెళ్లి వస్తాడు అంటూ వ్యాఖ్యానించారు.

''నేను కూడా ఎప్పుడైనా భారతమ్మతో మాట్లాడాలన్నా, కుటుంబ విషయాలు తెలుసుకోవాలన్నా నవీన్‌కు ఫోన్ చేస్తా'' అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను ప్రతిపక్ష మీడియా హైలైట్‌ చేస్తోంది. హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి రాత్రి 3 గంటల సమయంలో ఫోన్‌ చేస్తే ఆ సమయంలో నవీన్ ఫోన్ తీసుకెళ్లి భారతీకి ఇచ్చే పరిస్థితి ఉంటుందా అని ప్రశ్నిస్తోంది. ఒకవేళ నవీన్‌ పేరుతో తీసుకున్న సిమ్‌ను భారతీ వాడుతుంటే.. అలా మరొకరి పేరున ఉన్న సిమ్‌ను ఎందుకు వాడాల్సి వస్తోందని మీడియా దాడి మొదలుపెట్టింది.

సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి లాంటి వారితోనూ ఇతర ఫోన్‌ ద్వారా మాట్లాడాల్సిన అవసరం ఏముందని కామెంట్ చేస్తోంది. అసలు ఇంట్లో పనిమనుషుల ఫోన్ల నుంచి జగన్‌, భారతీలు మాట్లాడటం ఏంటని విమర్శిస్తోంది. ఇప్పుడు మరో అంశంపైనా చర్చ జరుగుతోంది. తాను నవీన్‌ ఫోన్‌ ద్వారా భారతీతో మాట్లాడినట్టు అవినాష్ రెడ్డి సీబీఐకి చెప్పారు. ఇప్పుడు నవీన్‌కు నోటీసులు వచ్చాయి. నవీన్‌ సీబీఐ ముందు చెప్పడానికి ప్రత్యేకంగా ఏమీ ఉండకపోచ్చు. ఫోన్‌ నవీన్‌దే అయినా.. మాట్లాడింది భారతీరెడ్డి కాబట్టి ఆమెకు కూడా పద్ధ‌తి ప్రకారం అయితే సీబీఐ నోటీసులు జారీ చేయాల్సి ఉంటుందంటున్నారు. ఫోన్ ఎవరిదైనా మాట్లాడిన విషయాలు ఏంటి అన్నది తెలుసుకోవాలంటే నోటీసులు ఇవ్వాల్సిన వారికే ఇవ్వాలి కదా అని టీడీపీ ప్రశ్నిస్తోంది.

First Published:  1 Feb 2023 4:02 AM GMT
Next Story