తెలుగుదేశం `కన్నా` ముందే వైసీపీతో బేరమాడారా..?
వైసీపీ నుంచి కన్నా వ్యాఖ్యలపై మేయర్ కావటి మనోహర్ నాయుడు స్పందించారు. బీజేపీ కన్నా లక్ష్మీనారాయణని పక్కన పెట్టేసిందని, దీంతో కన్నా వైసీపీలో చేరాలనుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీడీపీలో చేరబోతున్న ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, అంతకు ముందే వైసీపీలో చేరాలనుకున్నారా..? జనసేనతోనూ మంతనాలు జరిపారా..? అవుననే అంటున్నారు వైసీపీ నేతలు. బీజేపీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీ నారాయణ టీడీపీలో చేరకముందే ఆ రోటికాడ పాట పాడేస్తున్నారు. 23వ తేదీన పసుపు కండువా కప్పుకుంటారని కన్నాయే ప్రకటించారు. ఇంతలోనే గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ దాడిని ఖండిస్తూ కన్నాలక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలతో కలకలం రేగుతోంది.
జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి దాడుల సంస్కృతి పెరిగిందని కన్నా ఆరోపించారు. గత ముఖ్యమంత్రులు తమ పాలనలో ఫ్యాక్షనిజం తగ్గించటానికి కృషిచేశారని కన్నా చెప్పుకొచ్చారు. జగన్ మాత్రం ఫ్యాక్షన్ సంస్కృతి పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం అంతా పులివెందుల సంస్కృతిని తీసుకొచ్చారని దుయ్యబట్టారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి పట్ల పోలీసుల తీరు సరిగా లేదని, వైసీపీ అరాచకానికి పోలీసులు వంత పాడుతున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ నుంచి కన్నా వ్యాఖ్యలపై మేయర్ కావటి మనోహర్ నాయుడు స్పందించారు. బీజేపీ కన్నా లక్ష్మీనారాయణని పక్కన పెట్టేసిందని, దీంతో కన్నా వైసీపీలో చేరాలనుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో ఉంటూ వైసీపీతోనూ, జనసేనతోనూ మంతనాలు సాగించి.. చివరికి టీడీపీలో చేరుతున్న కన్నా లక్ష్మీనారాయణ, సీఎంపై విమర్శలు చేస్తే ఉపేక్షించమని మేయర్ కావటి మనోహర్ హెచ్చరించారు.