Telugu Global
Andhra Pradesh

షర్మిల లేకపోతే వైసీపీ లేదా..?

వైసీపీ తరపున రాష్ట్రమంతా తిరిగి అందరినీ గెలిపించినట్లు చెప్పారు. తాను కష్టపడి అందరినీ గెలిపిస్తేనే జగన్ ముఖ్యమంత్రయినట్లు షర్మిల చెప్పుకోవటమే చాలా విడ్డూరంగా ఉంది

షర్మిల లేకపోతే వైసీపీ లేదా..?
X

షర్మిల లేకపోతే వైసీపీ లేదా..? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది షర్మిల వల్లేనా..? ఏమో తాను అలాగే అనుకుంటున్నట్లున్నారు. తాను కూయకపోతే జనాలకు తెల్లారదని అనుకునే కోడి కథ‌లాగుంది షర్మిల వ్యవహారం. తాను లేకపోతే వైసీపీ లేదు, జగన్ ముఖ్యమంత్రి అయ్యేవారు కాదన్నట్లుగానే షర్మిల మాట్లాడారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను వైసీపీ కోసం కుటుంబాన్ని సైతం వదిలేసినట్లు చెప్పారు. ఇంటిని, పిల్లలను పక్కనపెట్టి ఎండనక, వాననక పాదయాత్రలు చేసినట్లు చెప్పారు. ఎప్పుడు అడిగితే అప్పుడు కాదనకుండా అండగా నిలబడ్డారట.

ఎందుకని అడగకుండా ఏమి చేయమంటే అదిచేశారట. వైసీపీ తరపున రాష్ట్రమంతా తిరిగి అందరినీ గెలిపించినట్లు చెప్పారు. తాను కష్టపడి అందరినీ గెలిపిస్తేనే జగన్ ముఖ్యమంత్రయినట్లు షర్మిల చెప్పుకోవటమే చాలా విడ్డూరంగా ఉంది. తాను లేకపోతే అసలు జగన్ ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదన్నట్లుగా షర్మిల మాట్లాడారు. తనను తాను చాలా ఎక్కువగా షర్మిల ఊహించుకుంటున్నారన్న విషయం అర్థ‌మైంది. షర్మిలకు సొంతం అస్తిత్వమే లేదన్న విషయం అందరికీ తెలుసు.

తెలంగాణ రాజకీయాల్లో ఏదో చేసేద్దామని అనుకుని ఇంకేదో అయిపోయి చివరకు తన పార్టీని చాపచుట్టేసి కాంగ్రెస్ లో విలీనం చేసేశారు. తెలంగాణలో జరుగుబాటు లేదని అర్థ‌మైన తర్వాతే దుకాణం కట్టేసి ఏపీకి షిఫ్టయ్యారు. విచిత్రం ఏమిటంటే.. తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కూడా తన వల్లే అనుకుంటున్నారు. తాను త్యాగం చేసుండకపోతే కాంగ్రెస్ ఎప్పటికీ అధికారంలోకి వచ్చుండేది కాదని చాలా బలంగా నమ్ముతున్నారు. అసలు తన ఉనికే జగన్ మీద ఆధారపడుందన్న విషయాన్ని షర్మిల మరచిపోయారు.

జగన్ లేకపోతే తాను జీరో అన్న విషయాన్ని మరచిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. జగన్ తో విభేదించి తెలంగాణలో పార్టీ పెట్టుకున్న తర్వాత దాని పరిస్థితి ఏమైందో షర్మిల మరచిపోయినట్లున్నారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేంత సీనే తనకు ఉంటే తెలంగాణలో పార్టీని ఎందుకు మూసేస్తారు..? కాంగ్రెస్ లో ఎందుకు విలీనం చేశారో చెబితే బాగుంటుంది. ఎన్నికలకు ముందు ఏపీలో అడుగుపెట్టి జగన్ పైన బురదచల్లాలన్నది షర్మిల టార్గెట్ గా తెలుస్తోంది. మరి ఆమె ప్రయత్నంలో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.

First Published:  26 Jan 2024 11:41 AM IST
Next Story