బాబుకు తోడుగా భువనేశ్వరీ రంగంలోకి దిగారా..?
రాష్ట్రంలో పొత్తు కావాలంటే పురందేశ్వరిని కలుపుకుని వెళ్లాల్సిందేనని చంద్రబాబును గ్రహించారు. ఈ నేపథ్యంలోనే మొన్న ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమంలో చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పక్కనే కూర్చోవడం, భువనేశ్వరి పురందేశ్వరిని ఆప్యాయంగా పలకరించడం జనం అందరి దృష్టిని ఆకర్షించాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి జరగబోయే ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి ప్రాణావసరం. చంద్రబాబు రాజకీయ జీవితానికైతే అది జీవన్మరణ సమస్యే. అందుకే తనోవైపు, కుమారుడు లోకేశ్ మరోవైపు నిత్యం జనంలో ఉండేలా కార్యక్రమాలు రూపకల్పన చేసి, కాలికి బలపం కట్టుకుని మరీ తిరుగుతున్నారు. ఎంత తిరిగినా పొత్తుల్లేకుండా గెలిచిన చరిత్ర తనకు లేదన్న అవగాహన బాబుకు పూర్తి స్థాయిలో ఉండటంతో మరో పక్క ఆ ప్రయత్నాలూ ముమ్మరం చేస్తున్నారు. ఆయనకు తోడుగా ఇప్పుడు భువనేశ్వరి రంగంలోకి దిగినట్టే కనిపిస్తోంది.
మేకపోతు గాంభీర్యమేనా..?
ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి 15 సీట్లు వస్తాయని ఇండియా టుడే-సీ ఓటర్ సర్వే పేర్కొనడంతో ఒంటరిగానే అధికారంలోకి వస్తామన్నట్లు చంద్రబాబు హడావుడి చేస్తున్నారు. అయితే తన వాస్తవ బలమెంతో తెలుసు కాబట్టే ఓపక్క పవన్ కల్యాణ్‌తో టచ్‌లో ఉంటూనే మరోవైపు కేంద్రంలో బీజేపీతో దోస్తీకి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్ స్మారక నాణెం ఆవిష్కరణ వేడుకలో బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో సుదీర్ఘంగా సంభాషిస్తూ కనిపించారు.
అక్క మంచిదంటున్న భువనేశ్వరి
మరోవైపు ఏపీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరిని ఇటీవల నియమించారు. చంద్రబాబుకు, పురందేశ్వరి కుటుంబానికి కనపడితే పలకరింపులే తప్ప పెద్దగా పొత్తుల్లేవు. అయితే రాష్ట్రంలో పొత్తు కావాలంటే పురందేశ్వరిని కలుపుకుని వెళ్లాల్సిందేనని చంద్రబాబును గ్రహించారు. ఈ నేపథ్యంలోనే మొన్న ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమంలో చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పక్కనే కూర్చోవడం, భువనేశ్వరి పురందేశ్వరిని ఆప్యాయంగా పలకరించడం జనం అందరి దృష్టిని ఆకర్షించాయి. తాజాగా భువనేశ్వరి మరో అడుగు ముందుకేసి తన అక్క పురందేశ్వరి చొరవతోనే ఎన్టీఆర్ స్మారక నాణెం వచ్చిందని ఆమెను తెగ పొగిడారు. ఆమె నోటి వెంట కుటుంబం మాట అదీ అక్క పురందేశ్వరి మాట ఎప్పుడూ వినని వారంతా బాబుకు తోడుగా భువనేశ్వరి కూడా బీజేపీతో కలిసేందుకు తనవంతు సహకారం అందిస్తున్నారని గుర్తు చేస్తున్నారు. సిస్టర్ సెంటిమెంట్ తీసుకురావడానికి భువనేశ్వరి ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
*