వ్యాపారులు వైసీపీకి వ్యతిరేకమా..? ధర్మాన వ్యాఖ్యల మర్మమేంటి..?
రాష్ట్రంలో ఏ ఒక్క వ్యాపార సంస్థ మీద దాడిచేసేందుకు ప్రభుత్వం ఒప్పుకోవడంలేదన్నారు ధర్మాన. కానీ, బిజినెస్ కమ్యూనిటీ వ్యతిరేకంగా ఎందుకు ఉంది..? వ్యాపారులు గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పాలన్నారు.
ఏపీలో వ్యాపార వర్గాలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నాయా..? ప్రతిపక్షాలు ఈ వ్యాఖ్యలు చేస్తే ఆరోపణలు అనుకోవచ్చు, కానీ సాక్షాత్తూ వైసీపీ నేత, మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. వ్యాపారులకు తాము ఎంతో చేశామని, కానీ బిజినెస్ కమ్యూనిటీ తమకు దూరంగా ఉందన్నారాయన. రాష్ట్రంలో ఏ ఒక్క వ్యాపార సంస్థ మీద దాడిచేసేందుకు ప్రభుత్వం ఒప్పుకోవడంలేదన్నారు ధర్మాన. కానీ, బిజినెస్ కమ్యూనిటీ వ్యతిరేకంగా ఎందుకు ఉంది..? వ్యాపారులు గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పాలన్నారు. వైశ్యులను బీసీల్లో కలిపేందుకు కేబినెట్ మినిస్టర్ గా ఉన్న తను గతంలో రికమండేషన్ పెట్టించానని గుర్తు చేశారాయన. తమ ప్రభుత్వంలో లంచాలు లేవని, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలలో ప్రజల్లోకి తీసుకువెల్లడమే రాజకీయానేతల పని అని చెప్పారు. సమాజంలో ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులను గుర్తించాలని పిలుపునిచ్చారు.
గెలిస్తే ఎంత..? ఓడితే ఎంత..?
ఓవైపు జగన్ 175 వైనాట్ అంటున్నారు, మరో వైపు ధర్మాన వంటి సీనియర్లు ఎన్నికల్లో గెలిస్తే ఎంత, ఓడితే ఎంత అంటూ వేదాంతం మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోతే కొంపలేవీ మునిగిపోవని, గెలిస్తే ఎంత..? ఓడిపోతే ఎంత..? అంటూ హాట్ కామెంట్లు చేశారాయన. సమాజాన్ని నడిపించేందుకు శక్తి, బలం ఉన్న యువకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కొందరికి వైసీపీ అంటే అవగాహానలేదని, అలాంటి వారిలో మార్పు రావాలన్నారు.
ఏపీలో విద్యా విధానం అధ్బుతంగా అమలవుతోందని చెప్పారు మంత్రి ధర్మాన. కానీ స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లవుతున్నా అక్షరం ముక్కరాని వారు కూడా సమాజంలో ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం, పౌష్టికాహారం వంటి కార్యక్రమాలు చేపట్టిందని, అయితే ఇవన్నీ ఓట్లకోసం మాత్రం కాదని స్పష్టం చేశారు ధర్మాన. ఆర్థిక అసమానతలు తగ్గించే పని ప్రభుత్వాలు చేయాలని, ఆపని ఇప్పుడు జగన్ సర్కారు చేస్తోందన్నారు.