Telugu Global
Andhra Pradesh

టీడీపీ ఆరోపణలకు చెక్‌పెట్టేలా డీజీపీ ఆదేశం

ప్రతిపక్షం ఈ హత్యను రాజకీయ కోణంలో ప్రచారం చేస్తుండటంతో జిల్లా ఎస్పీకి డీజీపీ క‌సిరెడ్డి రాజేంద్ర‌నాథ్‌రెడ్డి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.

టీడీపీ ఆరోపణలకు చెక్‌పెట్టేలా డీజీపీ ఆదేశం
X

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం రావివారిపాలెంలో అంగన్‌వాడీ కార్యకర్త హనుమాయమ్మ హత్య కేసు దర్యాప్తుపై డీజీపీ క‌సిరెడ్డి రాజేంద్ర‌నాథ్‌రెడ్డి స్పందించారు. ఈ అంశాన్ని టీడీపీ రాజకీయం చేస్తున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీకి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.

రావివారిపాలెం గ్రామంలో హనుమాయమ్మ అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఆమె భర్త టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయులుకు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. అదే గ్రామానికి చెందిన కొండల్‌రావు అనే వ్యక్తితో వీరికి చాలా కాలంగా భూవివాదం ఉంది. హైదరాబాద్‌లో ఉండే కొండల్‌రావు గ్రామానికి వచ్చిన ప్రతిసారి వీరి మధ్య గొడవ జరుగుతుండేది. కొండల్‌రావు వైసీపీలో చురుగ్గా ఉంటున్నారు.

ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం హనుమాయమ్మ ఇంటి దగ్గర కూర్చుని ఉండగా కొండల్‌రావు ట్రాక్టర్‌తో ఢీకొట్టి తొక్కించి చంపేశాడు. వారిద్దరూ వేర్వేరు పార్టీలకు చెందిన వారు కావడంతో ఆ అంశాన్ని టీడీపీ ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చింది. వైసీపీ నేతల దారుణాలు అంటూ మీడియాలో విరుచుకుపడింది. ఈ వ్యవహారానికి పార్టీలతో ఎలాంటి సంబంధం లేదని, వారి మధ్య వ్యక్తిగత వివాదాలతోనే హత్య జరిగిందని గ్రామస్తులంతా చెబుతున్నారు. ప్రతిపక్షం ఈ హత్యను రాజకీయ కోణంలో ప్రచారం చేస్తుండటంతో జిల్లా ఎస్పీకి డీజీపీ క‌సిరెడ్డి రాజేంద్ర‌నాథ్‌రెడ్డి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.

ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కొండల్‌రావు కోసం గాలించాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. అసలు హత్యకు కారణాలను స్పష్టంగా నిగ్గుతేల్చాలని చెప్పారు. ప్రస్తుతం కొండల్‌రావు పరారీలో ఉన్నారు.

First Published:  7 Jun 2023 9:29 AM GMT
Next Story