కొండ నిండినది.. శ్రీవారి దర్శనానికి 48గంటలు..
ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి ఉచిత దర్శనానికి 48గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లు, షెడ్లు అన్నీ నిండిపోయాయి.
తిరుమల గిరులు భక్తజన సంద్రాన్ని తలపిస్తున్నాయి. సహజంగా నవరాత్రి పర్వదినాల్లో జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో కొండ భక్తులతో కిక్కిరిసి ఉంటుంది. కానీ ఈ ఏడాది బ్రహ్మోత్సవ సంబరం పూర్తయిన తర్వాత కూడా తిరుమలలో రద్దీ తగ్గలేదు. ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి ఉచిత దర్శనానికి 48గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లు, షెడ్లు అన్నీ నిండిపోయాయి. గోగర్భం డ్యామ్ వరకు 4 కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు బారులు తీరి స్వామి దర్శనం కోసం నిరీక్షిస్తున్నారు.
శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 70,007 హుండీ ఆదాయం 4.25 కోట్ల రూపాయలు. కరోనా తర్వాత దర్శనాల సంఖ్య ఇటీవల భారీగా పెరిగిందనడానికి ఇవే నిదర్శనం. భక్తులు సంయమనంతో వేచిఉండి స్వామివారి దర్శనం చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. పెరటాసి మాసం కావడంతో అనూహ్యంగా రద్దీ పెరిగిందని, తిరుమల యాత్రను భక్తులు వాయిదా వేసుకోవాలని కూడా సూచిస్తున్నారు అధికారులు. తాత్కాలికంగా క్యూలైన్ల లోకి భక్తుల అనుమతి రద్దు చేసి, అక్కడినుంచి భక్తులను విశ్రాంతి భవనాలకు బస్సుల ద్వారా తరలిస్తున్నారు.
టీటీడీ యాత్ర సదన్, కల్యాణ కట్ట, అన్నదాన సత్రం, లడ్డూ వితరణ కేంద్రం, అఖిలాండం, ఇతర యాత్రా ప్రదేశాలన్నిటిలో భక్తులు కిటకిటలాడుతున్నారు. భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రద్దీ ప్రాంతాల్లో ఉచిత ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేసి త్రాగునీరు, అల్పాహారం, పాలు అందిస్తోంది టీటీడీ. శుక్ర, శని, ఆది వారాల్లో సిఫార్సు లేఖలను రద్దు చేసింది. ఆన్‌లైన్‌లో 300 రూపాయల టికెట్ తీసుకున్నవారికి 4గంటల్లో స్వామివారి దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం భక్తులకు మాత్రం 48గంటల సమయం పడుతుండటం విశేషం. శనివారంతోపాటు, ఆదివారం స్వామివారి దర్శనంకోసం వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా.