Telugu Global
Andhra Pradesh

అప్పన్న దర్శనానికి అవస్థలు.. మంత్రికి చీవాట్లు

దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఉత్తరాంధ్రకి చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ అక్కడకు రాగా.. భక్తులు తమ బాధలు చెప్పుకున్నారు. క్యూలైన్‌ వద్దకు వెళ్లిన మంత్రి కొట్టు సత్యనారాయణను భక్తులు నిలదీశారు.

అప్పన్న దర్శనానికి అవస్థలు.. మంత్రికి చీవాట్లు
X

విశాఖపట్నం జిల్లా సింహాచలంలోని అప్పన్న స్వామి నిజరూప దర్శనం రోజున భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. వైసీపీ ప్రభుత్వంపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి కూడా.. ఇలాంటి చందనోత్సవాన్ని తన జీవితంలో చూడలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏర్పాట్లు అస్తవ్యస్థంగా ఉన్నాయంటూ ఆగ్రహించారు. భక్తుల అవస్థలు చూస్తుంటే కన్నీళ్లు వచ్చాయని చెప్పారు. భక్తుల ఇబ్బందుల మధ్య దైవదర్శనం బాధ కలిగించిందని అన్నారు స్వరూపానందేంద్ర.

వైశాఖ శుద్ధ తదియ సందర్భంగా అప్పన్నస్వామి చందనోత్సవం, నిజరూప దర్శనం కోసం భక్తులు ఉదయం నుంచే క్యూ కట్టారు. వేలాది మంది భక్తులు సింహాచలానికి తరలివచ్చారు. దేవాదాయ శాఖ అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. సామాన్య భక్తులను పట్టించుకోకుండా ప్రముఖులకు దర్శనం కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు కొంతమంది. అయితే ప్రముఖులకు కూడా ఈసారి చేదు అనుభవం ఎదురైంది. ప్రొటోకాల్ మర్యాదలు ఉన్న న్యాయమూర్తులు, ఐఏఎస్, ఐపీఎస్ లకు కూడా స్వామివారి దర్శనం అంత సులభంగా దక్కలేదు. గంటల సేపు వారు కూడా క్యూ లైన్లలో వేచి చూడాల్సి వచ్చింది. దీంతో దర్శనాల విషయంలో ఈసారి గందరగోళం నెలకొంది. 1500 రూపాయల టికెట్ తీసుకున్నా కూడా క్యూలైన్లలో గంటలసేపు నిలబడాల్సి వచ్చిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఉత్తరాంధ్రకి చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ అక్కడకు రాగా.. భక్తులు తమ బాధలు చెప్పుకున్నారు. వారిద్దరికీ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్యూలైన్‌ వద్దకు వెళ్లిన మంత్రి కొట్టు సత్యనారాయణను భక్తులు నిలదీశారు. తాగునీరు సహా కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు వచ్చి వెళ్లిన తర్వాత కూడా పరిస్థితి చక్కబడలేదు. ఏర్పాట్లపై ముందస్తు కసరత్తు చేయకపోవడంతోనే ఇలాంటి ఇబ్బందులు ఎదురైనట్టు తెలుస్తోంది. భక్తుల ఆగ్రహంతోపాటు, స్వరూపానందేంద్ర స్వామి తీవ్ర వ్యాఖ్యలు ఈసారి కలకలం రేపాయి.

First Published:  23 April 2023 10:07 PM IST
Next Story