హతవిధీ.. రెండో జాబితాలోనూ తేలని ఉమా భవిత
మైలవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ వైసీపీ నుంచి టీడీపీలో చేరడంతో ఇక్కడ మాజీ మంత్రి దేవినేని ఉమా సీటు ఎగిరిపోయేలా ఉంది.
టీడీపీ ప్రభుత్వంలో అధికారం చలాయించి, మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ధాటికి రాజకీయంగా ప్రాబల్యం కోల్పోయిన మాజీ మంత్రులు ఇప్పుడు టికెట్ దక్కుతుందా.. లేదా అని టెన్షన్ పడుతున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లా మైలవరం, పెనమలూరు స్థానాల్లో మాజీ మంత్రి దేవినేమి ఉమా, సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో పాటు బోడే ప్రసాద్‌ల మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది.
ఉమాతో మొదలు
మైలవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ వైసీపీ నుంచి టీడీపీలో చేరడంతో ఇక్కడ మాజీ మంత్రి దేవినేని ఉమా సీటు ఎగిరిపోయేలా ఉంది. మైలవరం వసంతకు ఇస్తే.. నువ్వు పెనమలూరు వెళ్లు అని చంద్రబాబు సంకేతాలిస్తున్నా ఉమా ససేమిరా అంటున్నారు. ఈ పంచాయితీ నిన్న ప్రకటించిన టీడీపీ రెండో జాబితాలో కూడా తేలలేదు. వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే కాబట్టి వసంతకే ప్రాధాన్యమిస్తారన్న వార్తల నేపథ్యంలో దేవినేని ఉమా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వాస్తవానికి ఉమా మైలవరంలో నెగ్గడానికే చాలా కష్టపడాలి. ఇక పెనమలూరు అంటే ఓడిపోయినట్లేనని, అందులో అక్కడ జోగి రమేష్ లాంటి బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవాల్సి రావడం కష్టమని ఉమాకూ తెలుసు.. అందుకే పెనమలూరు వెళ్లడానికి ససేమిరా అంటున్నారు.
బాబు ఫొటోతో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా
ఒకవేళ పెనమలూరు వెళ్లడానికి ఉమా సరే అన్నా, అక్కడ పార్టీ ఇన్‌ఛార్జి బోడే ప్రసాద్ ఒప్పుకునేలా లేరు. దేవినేని ఉమా, వసంత కృష్ణప్రసాద్, మైనార్టీ నాయకుడు ఎంఎస్ బేగ్‌లలో ఎవరు మీ అభ్యర్థి కావాలనుకుంటున్నారు అని టీడీపీ ఐవీఆర్ఎస్ సర్వే చేస్తోంది. దీంతో బోడే ప్రసాద్ మండిపడుతున్నారు. తనకు టికెటివ్వకపోతే చంద్రబాబు ఫొటో పెట్టుకుని ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని బోడే ప్రసాద్ ప్రకటించడం టికెట్ రచ్చను పీక్స్‌కి తీసుకెళ్లింది.