వైసీపీ ఎమ్మెల్యే కాన్వాయ్ పై డిటొనేటర్ తో దాడి
తనపై ఎవరో హత్యాయత్నం చేశారని, దేవుడి దయతో తప్పించుకున్నానని అన్నారు ఎమ్మెల్యే శంకర నారాయణ. కుట్ర కోణాన్ని పోలీసులు చేధించాలన్నారు.
పెనుగొండ వైసీపీ ఎమ్మెల్యే శంకర నారాయణ కాన్వాయ్ పై డిటొనేటర్ తో దాడి జరిగింది. అయితే ఈ దాడిలో ఎవరూ గాయపడలేదు. డిటొనేటర్ పేలకపోవడం, అది గురితప్పి పొదల్లో పడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డిటొనేటర్ తో దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన గణేష్ గా గుర్తించారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు.
సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని గడ్డం తండా పంచాయతీ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే శంకర నారాయణ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరగా.. ఆయన కారుని టార్గెట్ చేసి డిటొనేటర్ విసిరాడు దుండగుడు. అది గురితప్పి పొదల్లోపడిపోయింది. ఆ ఎలక్ట్రిక్ డిటొనేటర్ కి పవర్ సప్లై కూడా లేదు, దీంతో అది పేలలేదు. డిటొనేటర్ విసిరారు అనే వార్త బయటకు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే అది విసిరిన గణేష్ ని అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులోనే అతడు డిటొనేటర్ విసిరాడని పోలీసులు అనుమానిస్తున్నారు. లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
దేవుడి దయతో తప్పించుకున్నా..
తనపై ఎవరో హత్యాయత్నం చేశారని, దేవుడి దయతో తప్పించుకున్నానని అన్నారు ఎమ్మెల్యే శంకర నారాయణ. కుట్ర కోణాన్ని పోలీసులు చేధించాలన్నారు. డిటోనేటర్ పేలి ఉంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదన్నారు. తనకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఈ దాడి చేసినట్లు భావిస్తున్నానని అన్నారు శంకర నారాయణ.