ఉత్తరాంధ్ర సైకిల్ పై వారసుల సవారీ
పార్టీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పార్టీపై పూర్తిస్థాయి పట్టు సాధించే పనిలో ఉన్నారు. నియోజకవర్గాలలోనూ వారసులు రంగంలోకి దిగి, తమకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్‌తో వస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. సైకిల్ గుర్తుపై పోటీ చేసి నాయకులుగా ఎదిగిన వారు వివిధ పార్టీల్లో కీలక పదవుల్లో వున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ టీడీపీ నుంచి వచ్చిన వారే. తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి వెళ్లినవారే. తెలుగురాష్ట్రాల్లో చాలామంది రాజకీయ నేతలకు తెలుగుదేశం పుట్టిల్లులాంటిది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నలభై ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ వారసుల తలనొప్పి శాపంలా వెంటాడుతోంది.
పార్టీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పార్టీపై పూర్తిస్థాయి పట్టు సాధించే పనిలో ఉన్నారు. నియోజకవర్గాలలోనూ వారసులు రంగంలోకి దిగి, తమకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్‌తో వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి చాలా మంది వారసులు ఉవ్విళ్లూరుతున్నారు. తమకే టీడీపీ సీట్లు కావాలని పట్టుబడుతున్నారు. అధినేత తన వారసుడికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తున్న సందర్భంలో, తమ వారసుల విషయంలో అభ్యంతరం చెప్పకపోవచ్చనే ధీమాతో టీడీపీ నేతలు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాకి వచ్చేసరికి పాతపట్నం కలమట వెంకటరమణమూర్తి తన కొడుకు సాగర్ ని తన వెంటే తిప్పుతున్నారు. ఈ ఎన్నికలకి కాకపోయినా, వచ్చే ఎన్నికల నాటికైనా తన వారసుడికి టికెట్ ఆశిస్తున్నారు. నరసన్నపేట బగ్గు రమణమూర్తి తనయుడు రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నారు. ఎచ్చెర్ల నుంచి తన కొడుకు రామ్ మల్లిక్ నాయుడిని పోటీకి దింపాలని కిమిడి కళా వెంకటరావు తహతహలాడుతున్నారు.
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం నుంచి కుమార్తె గ్రీష్మకి సీటు కోసం మాజీ స్పీకర్ ప్రతిభాభారతి ప్రయత్నాలు ఆరంభించారు. చీపురుపల్లి సీటుని గత ఎన్నికలకే కిమిడి మృణాళిని తన కొడుకు నాగార్జునకి అప్పగించి రాజకీయాల నుంచి సైడయ్యారు. నెల్లిమర్ల టీడీపీ టికెట్ తమ వారసులకి ఇవ్వాలని కోరిన పతివాడ నారాయణస్వామినాయుడికి నిరాశే మిగిలింది. విశాఖ జిల్లాలో నర్సీపట్నం సీటు నుంచి పోటీచేసే అయ్యన్నపాత్రుడు ఇద్దరు కొడుకులు విజయ్, రాజేశ్‌లు తమ పొలిటికల్ ఎంట్రీకి ఇదే సరైన సమయమని తండ్రిపై ఒత్తిడి తెస్తున్నారు. పెందుర్తి నుంచి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తనయుడు అప్పలనాయుడు పోటీకి ఉత్సాహంగా ఉన్నారు. మొత్తానికి ఉత్తరాంధ్ర జిల్లాల్లో టీడీపీ వారసుల రాజకీయ అరంగేట్రం ఆశలు అటు తల్లిదండ్రులకు-ఇటు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది.