ఏపీలో ముందస్తు ఎన్నికలు.. నోరుజారిన డిప్యూటీ సీఎం రాజన్నదొర
గత కొంతకాలంగా వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకి వెళ్లే ఉద్దేశంతోనే పలు కార్యక్రమాల్ని చేపడుతున్నారు. ప్రతి ఎమ్మెల్యే గడప గడపకీ వెళ్లాలని.. వ్యతిరేకతని తగ్గించుకోవాలని సూచిస్తూ వస్తున్నారు. అలానే జగనన్నే మా భవిష్యత్తు, జగనన్నకి చెబుదాం కార్యక్రమాలు కూడా ఈ కోవలోకే వస్తాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు గత కొన్ని నెలలుగా చెప్తున్నారు. కానీ.. వైసీపీ మాత్రం ముందస్తు ఎన్నికలకి వెళ్లే ఆలోచనే తమకి లేదంటూ ఇప్పటికే ఎన్నోసార్లు స్పష్టం చేసింది. అయితే తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్నదొర మాత్రం ఈ ఏడాది చివర్లో ఏపీలో ఎన్నికలు జరుగుతాయంటూ నోరుజారారు. పార్వతీపురంలో విలేకర్లతో మాట్లాడుతూ.. డిసెంబరు - జనవరిలో ఎన్నికలు జరుగుతాయని.. ఆ ఎన్నికల్లో వైసీపీనే గెలుస్తుందని చెప్పుకొచ్చారు.
వాస్తవానికి ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఇంకా నాలుగేళ్లు కూడా పూర్తికాలేదు. 2019, మే 30న సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేశారు. కానీ గత కొంతకాలంగా వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకి వెళ్లే ఉద్దేశంతోనే పలు కార్యక్రమాల్ని చేపడుతున్నారు. ప్రతి ఎమ్మెల్యే గడప గడపకీ వెళ్లాలని.. వ్యతిరేకతని తగ్గించుకోవాలని సూచిస్తూ వస్తున్నారు. అలానే జగనన్నే మా భవిష్యత్తు, జగనన్నకి చెబుదాం కార్యక్రమాలు కూడా ఈ కోవలోకే వస్తాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
ఇటీవల బహిరంగ సభల్లో కూడా వైఎస్ జగన్ విమర్శల దాడిని మరింత పెంచారు. టీడీపీ- జనసేన పొత్తుపై సెటైర్లు వేస్తూనే.. మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి అంటూ సెంటిమెంట్‌ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ రాజకీయ ఉపన్యాసాలు, చేపడుతున్న కార్యక్రమాలు రాజకీయ ప్రచారాన్ని తలపిస్తోంది. దాంతో అంతర్లీనంగా వైసీపీలో ఉప ఎన్నికలపై మంతనాలు జరుగుతున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. తాజాగా రాజన్నదొర వ్యాఖ్యలతో దాదాపు క్లారిటీ వచ్చేసింది.