Telugu Global
Andhra Pradesh

మ‌తంతో ప‌బ్బంగ‌డుపుకుంటున్న దుర్మార్గ‌పు పార్టీ బీజేపీ.. - ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌

తెలుగుదేశం పార్టీతో అంట కాగినప్పుడు మీ పార్టీ నేత దేవదాయ శాఖ మంత్రిగా ఉండగా 40 గుడులు కూల్చినప్పుడు ఆ పార్టీని ఎందుకు పల్లెత్తు మాట అనలేదంటూ మండిప‌డ్డారు.

మ‌తంతో ప‌బ్బంగ‌డుపుకుంటున్న దుర్మార్గ‌పు పార్టీ బీజేపీ.. - ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌
X

మతానికి రాజకీయ రంగు పులిమి పబ్బం గడుపుకుంటున్న దుర్మార్గపు పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక బీజేపీ మాత్రమేనని ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తీవ్రంగా విమర్శించారు. హిందూ మతాన్ని, హిందూ దేవుళ్లను రాజకీయంగా వాడుకోవడం బీజేపీకి ఒక క్రీడలాగా మారిందని ఆయ‌న మండిప‌డ్డారు. హిందూ మతం మీద, దేవుళ్ళ మీద వీరికి పేటెంట్ హక్కు ఏమీ లేదని, ఎవరూ ఇవ్వలేదని చెప్పారు. రాష్ట్రమంతా శివరాత్రి మహోత్సవాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అత్యంత వైభవంగా జరుగుతున్న తరుణంలో ట్విట్టర్లో సదుద్దేశంతో వచ్చిన ఒక చిన్న క్యారికేచర్‌ను పట్టుకుని వక్ర భాష్యాలు వల్లిస్తూ రెచ్చిపోవడం బీజేపీ నేతల దిగజారుడుతనానికి నిదర్శనమ‌ని చెప్పారు.

ఆదివారం కొట్టు స‌త్య‌నారాయ‌ణ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. హిందూ దేవుళ్ళు రాముడు, శివుడిని వాడుకుని వదిలేసే ఈ బీజేపీని, ఆ పార్టీ నేతలను ఏమి చేయాలో ఆ భగవంతుడే చూసుకుంటాడన్నారు. దేవుళ్ళ విషయంలో అబద్ధాలు ఆడితే కళ్ళు పోతాయని అంటుంటార‌ని, అది వీళ్లకు కూడా వర్తిస్తుందని చెప్పారు. రాష్ట్రమంతా శివనామస్మరణతో శివమయమైన ప్రస్తుత తరుణంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉందనే విషయాన్ని కూడా వదిలేసి రాజకీయం చేయడం ఎంతవరకు సబబని ప్ర‌శ్నించారు. బీజేపీ నేతలు చేస్తున్న అల్లరి శివుడికి చేస్తున్న మహా అపచారంగా ఆయన అభివర్ణించారు.

తెలుగుదేశం పార్టీతో అంట కాగినప్పుడు మీ పార్టీ నేత దేవదాయ శాఖ మంత్రిగా ఉండగా 40 గుడులు కూల్చినప్పుడు ఆ పార్టీని ఎందుకు పల్లెత్తు మాట అనలేదంటూ మండిప‌డ్డారు. మీరంతా అప్పుడు ఏం చేస్తున్నారు.. ఎక్కడ నిద్రపోతున్నారని ప్ర‌శ్నించారు. మీరు కూలిస్తే మేము ఆ దేవాలయాలను పునర్నిర్మించామని చెప్పారు. ఇప్పటికీ వైఎస్సార్‌సీపీపై ద్వేషంతో రాజకీయంగా ఎదుర్కోలేక.. రథాలు తగలబెట్టించి, విగ్రహాల కాళ్లూచేతులూ విరగ్గొట్టి ఆ బురదంతా వైఎస్సార్‌సీపీపై చల్లాలని కుట్రలు, కుతంత్రాలు చేసింది మీరు కాదా అంటూ నిల‌దీశారు.

వైఎస్సార్‌సీపీ ప్ర‌భుత్వానికి, ముఖ్యమంత్రికి హిందూ మతం మీద, మత సామరస్యం మీద ఎంతో గౌరవం, ఉన్నత భావాలు ఉన్నాయని ఉప ముఖ్య‌మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ చెప్పారు. ఆయన ఆదేశానుసారం ఈ రాష్ట్రంలో తాను నిర్వహిస్తున్న దేవదాయ శాఖ ఆధ్వర్యంలో హిందూ దేవాలయాల పునర్వైభవానికి, హిందూ మత పరిరక్షణకు, సంస్కృతిని కాపాడడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని ఆయన వివరించారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని సహేతుక విమర్శలు చేయాల‌ని, లేదా సలహాలు ఇవ్వాల‌ని, అంతేతప్ప రాజకీయ పబ్బం గడుపుకోవడానికి త‌మ‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఆకాశం మీద ఉమ్మినట్టు అవుతుందని గుర్తుపెట్టుకోవాలని మంత్రి హితవు పలికారు.

First Published:  20 Feb 2023 9:28 AM IST
Next Story