భువనేశ్వరి అబద్ధాల యాత్ర.. న్యాయస్థానాన్ని తప్పుపట్టేలా ఉంది - ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ
నాడు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి.. ఆయన కుంగిపోయి చనిపోయేలా చేసింది చంద్రబాబే అని, తండ్రికి అంత జరిగినా స్పందించని భువనేశ్వరి.. నేడు చంద్రబాబు జైలుకు వెళితే మాత్రం పోరాటం పేరుతో అబద్ధాలు వల్లెవేస్తున్నారని మంత్రి విమర్శించారు.
నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి చేపట్టిన యాత్రపై ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. నిజం గెలవాలంటూ నారా భువనేశ్వరి అబద్ధాలతో చేస్తున్న యాత్ర.. న్యాయస్థానాన్ని తప్పుపట్టేలా ఉందని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నాడు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి.. ఆయన కుంగిపోయి చనిపోయేలా చేసింది చంద్రబాబే అని, తండ్రికి అంత జరిగినా స్పందించని భువనేశ్వరి.. నేడు చంద్రబాబు జైలుకు వెళితే మాత్రం పోరాటం పేరుతో అబద్ధాలు వల్లెవేస్తున్నారని మంత్రి విమర్శించారు. చంద్రబాబును జైల్లో పెడితే ప్రజలు ఎవరైనా బాధపడ్డారా అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు కరెక్ట్, ఎన్టీఆర్‌దే తప్పు అని భువనేశ్వరి చెప్పగలరా అని నిలదీశారు.
చంద్రబాబు అరెస్టుతో ప్రజల్లో సానుభూతి వస్తుందని ఆశించారని, అది ఏమాత్రం కనిపించకపోవడంతో టీడీపీ నేతలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని మంత్రి చెప్పారు. సెంట్రల్ జైలులో చంద్రబాబుకు అత్యంత భద్రత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రక్షణ చర్యలు తీసుకుంటుంటే..లోకేష్ మాత్రం ఆయనకు ప్రాణహాని ఉందంటూ చేస్తున్న ఆరోపణలను చూస్తే ఆయన తీరుపై అనుమానం కలుగుతోందన్నారు.
టీడీపీ–జనసేన పొత్తు.. రెండు అక్రమ పార్టీల కలయిక అని మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. గోదావరి జిల్లాల్లో ఆ రెండు పార్టీల మధ్య సీట్ల కొట్లాట తథ్యమని అన్నారు. ఆర్థిక లాభం కోసం చంద్రబాబు కాళ్లు పట్టుకున్న పవన్.. కాపు సామాజిక వర్గం సిగ్గుపడేలా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల లోపే జనసేన–టీడీపీ కూటమి ముక్కలు ముక్కలు కావడం ఖాయమని మంత్రి స్పష్టం చేశారు.