Telugu Global
Andhra Pradesh

ఏపీలో బిగ్ ట్విస్ట్.. వారికి సెలవుల్లేవు, రిలీవింగ్ లేదు

ఆరోపణలున్నవారందర్నీ ఇప్పుడు ఎక్కడికీ వెళ్లకుండా కట్టుదిట్టం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వారిపై చర్యలు తీసుకునే అవకాశాలున్నాయని ఊహాగానాలు వినపడుతున్నాయి.

ఏపీలో బిగ్ ట్విస్ట్.. వారికి సెలవుల్లేవు, రిలీవింగ్ లేదు
X

వైసీపీ ప్రభుత్వం పక్కకు తప్పుకుంది, టీడీపీ ప్రభుత్వం ఏర్పాటుకి మరికొన్నిరోజులు టైమ్ ఉంది. ప్రస్తుతం ఉన్నది సంధికాలం. ఈ సంధికాలంలో డిప్యుటేషన్ పై వచ్చిన అధికారులకు కొత్త చిక్కొచ్చిపడింది. వారిలో చాలామంది తమ మాతృ సంస్థలకు వెళ్లేందుకు రిలీవింగ్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. కానీ రిలీవింగ్ కి అవకాశం లేకుండా చేసింది కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం. ఆమేరకు అనధికారిక ఆదేశాలు జారీ అయ్యాయి. వారికి కనీసం సెలవు కూడా ఇవ్వడానికి వీల్లేదని తేల్చి చెప్పేశారు.

తనకు అనుకూల అధికారుల్ని డిప్యుటేషన్ పై తెచ్చుకుని కావాల్సిన పోస్టుల్లో నియమించుకున్నారని జగన్ పై గతంలోనే టీడీపీ ఆరోపణలు చేసింది. పైగా ఒకే సామాజిక వర్గం వారిని ఇలా డిప్యుటేషన్ పై తెచ్చుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ ఆరోపణలున్నవారందర్నీ ఇప్పుడు ఎక్కడికీ వెళ్లకుండా కట్టుదిట్టం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వారిపై చర్యలు తీసుకునే అవకాశాలున్నాయని కూడా ఊహాగానాలు వినపడుతున్నాయి.

ఏపీ గనుల శాఖ ఎండీ, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ, ఏపీఎఫ్ఎస్ఎల్ ఎండీ, పరిశ్రమల శాఖ కమిషనర్.. ఇలా చాలామంది డిప్యుటేషన్ క్యాన్సిల్ చేయించుకోవాలనుకున్నారు. కానీ కుదర్లేదు. తెలంగాణకు వెళ్లేందుకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు. ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ సెలవుపై వెళ్లాలనుకున్నా కుదరలేదని తెలుస్తోంది. మరి కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వీరి పరిస్థితి ఏంటనేది తేలాల్సి ఉంది.

First Published:  6 Jun 2024 2:52 AM GMT
Next Story