Telugu Global
Andhra Pradesh

కేఆర్‌ఎంబీ కోసం ఏపీలో ప్రాంతాలవారీగా డిమాండ్లు

2018లోనే విజయవాడ శివారులో కేఆర్ఎంబీ కార్యాలయం కోసం భవనాలను కూడా పరిశీలించారని మరి ఇప్పుడు హైదరాబాద్‌ నుంచి విశాఖపట్టణానికి తరలించాలన్న ఆలోచన ఎందుకు చేస్తున్నారని వారు ప్రశ్నించారు.

కేఆర్‌ఎంబీ కోసం ఏపీలో ప్రాంతాలవారీగా డిమాండ్లు
X

కృష్టా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కార్యాలయం ఏర్పాటు విషయంలో ప్రాంతాల వారీగా ఏపీలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. కేఆర్ఎంబీ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇదివరకే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న కార్యాలయాన్ని ఏపీకి తరలించే వ్య‌వహారంపై ఈ నెల మూడో వారంలో జరిగే కేఆర్ఎంబీ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.

ఈ నేపథ్యంలోనే అటు విజయవాడ రైతులు, రాయలసీమ నేతలు వారి వారి డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. కేఆర్ఎంబీ కార్యాలయాన్ని విశాఖకు తరలిస్తే సహించే ప్రసక్తే లేదని విజయవాడలో ఆంధ్రప్రదేశ్ సాగునీటి సంఘాల సమాఖ్య హెచ్చరించింది. నది ఇక్కడే ఉంది, నీటి అవసరాలు ఇక్కడే ఉన్నాయి, అలాంటప్పుడు రైతులకు అందుబాటులో ఉండేలా కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలని విశాఖకి తీసుకెళ్లవద్దని సమాఖ్య డిమాండ్ చేసింది.

విశాఖకు కార్యాలయాన్ని తరలించాలన్నది అనాలోచిత, అర్థం లేని మూర్ఖపు చర్య అని సమాఖ్య విమర్శించారు. 2018లోనే విజయవాడ శివారులో కేఆర్ఎంబీ కార్యాలయం కోసం భవనాలను కూడా పరిశీలించారని మరి ఇప్పుడు హైదరాబాద్‌ నుంచి విశాఖపట్టణానికి తరలించాలన్న ఆలోచన ఎందుకు చేస్తున్నారని వారు ప్రశ్నించారు.

అటు బీజేపీ నేత, రాయలసీమకు చెందిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాత్రం కేఆర్ఎంబీ కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఉన్న బోర్డు కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకోవడం తుగ్లక్ ఆలోచన అని బైరెడ్డి ఫైర్ అయ్యాడు. హైదరాబాదులో కృష్టా బోర్డు చైర్మన్ ను కలిసి బైరెడ్డి వినతి పత్రం అందజేశారు. బోర్డును కర్నూలుకి తరలించాలని ఎక్కడో దూరంగా ఉన్నా విశాఖకు తరలించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని బైరెడ్డి వాదించారు.

కృష్టా నది యాజమాన్య బోర్డును కర్నూలులోనే ఏర్పాటు చేయాలంటూ ఈ నెల 17న నంద్యాలలో సత్యాగ్రహం చేస్తున్నట్టు రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామిరెడ్డి వెల్లడించారు. కృష్ణా నదికి ఏ మాత్రం సంబంధం లేని విశాఖలో బోర్డు ఏర్పాటు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా కార్యాలయాన్ని కర్నూలులోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా పరివాహక ప్రాంతంతో ఏ మాత్రం సంబంధం లేని విశాఖలో ఏర్పాటు చేయడమన్నది అనాలోచిత నిర్ణయమన్నారు. ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా జగన్మోహన్ రెడ్డి చర్యలు ఉన్నాయని రామకృష్ణ ఆరోపించారు.

First Published:  10 Jan 2023 4:24 AM GMT
Next Story