Telugu Global
Andhra Pradesh

ఏపీలో ఆ ఛానళ్లకు గ్రీన్ సిగ్నల్ .. ఢిల్లీ హైకోర్టు ఆదేశం

హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చరిత్రాత్మకమైనవి NBF అభిప్రాయపడింది. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాల్లో ఒకటైన భావప్రకటనా స్వేచ్ఛను ఈ ఉత్తర్వులు కాపాడాయని తెలిపింది.

ఏపీలో ఆ ఛానళ్లకు గ్రీన్ సిగ్నల్ .. ఢిల్లీ హైకోర్టు ఆదేశం
X

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని న్యూస్ ఛానళ్లపై అప్రకటిత నిషేధం అమలులోకి వచ్చింది. మల్టీ సిస్టమ్ ఆపరేటర్లు(MSO) తమ విచక్షణ మేరకు కొన్ని ఛానళ్ల ప్రసారాలను ఆపివేశారు. అందులో సాక్షి కూడా ఉంది. సహజంగానే వైసీపీ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగానే ఛానల్ ప్రసారాలను అడ్డుకున్నారని మండిపడ్డారు వైసీపీ నేతలు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరించాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై ఆయా ఛానళ్ల యాజమాన్యాలు న్యాయపోరాటానికి దిగాయి. చివరకు విజయం సాధించాయి.

సాక్షి సహా మరో మూడు ఛానళ్ల ప్రసారాలను ఏపీలో అన్యాయంగా అడ్డుకుంటున్నారని న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ ఫెడరేషన్(NBF) తరపున ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు ఈ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ కక్షలకు వార్తా ఛానళ్లను బలి చేయొద్దని సూచించింది. వెంటనే ఆచా ఛానళ్ల ప్రసారాలను తక్షణం పునరుద్ధరించాలని ఆదేశించింది. దీనిపై ఛానళ్ల యాజమాన్యాలు సంతోషం వ్యక్తం చేశాయి.

ఢిల్లీలోనే ఎందుకు..?

కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ ఢిల్లీ హైకోర్టు పరిధిలో ఉండటంతో అక్కడే ఈ పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చరిత్రాత్మకమైనవి NBF అభిప్రాయపడింది. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాల్లో ఒకటైన భావప్రకటనా స్వేచ్ఛను ఈ ఉత్తర్వులు కాపాడాయని తెలిపింది. ట్రాయ్‌ నిబంధనల ప్రకారం ఛానళ్ల ప్రసారాలు నిలిపివేయడం చట్టవిరుద్ధమని, అలా చేస్తే కేబుల్‌ ఆపరేటర్లతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టేనని గుర్తు చేసింది.

First Published:  25 Jun 2024 6:12 PM IST
Next Story