Telugu Global
Andhra Pradesh

ఏపీ BJPలో ముదిరిన రగడ: సోము వీర్రాజు Vs కన్నా లక్ష్మీనారాయణ‌

సోమూ వీర్రాజు అధ్యక్షుడయ్యాక కన్నా కు ప్రాధాన్యత తగ్గింది. కార్యక్ర‌మాల్లో ఆయనను ఇన్వాల్వ్ చేయడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. దీనిపై కోపంగా ఉన్న 'కన్నా' కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నాడు.

ఏపీ BJPలో ముదిరిన రగడ: సోము వీర్రాజు Vs కన్నా లక్ష్మీనారాయణ‌
X

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోమూ వీర్రాజు హటాత్తుగా పలు జిల్లాల అధ్యక్షులను తొలగించి కొత్తవాళ్ళను నియమించడంతో పలువురు నాయకుల్లో ఇప్పటి వరకు లోలోపల రగులుతున్న ఆగ్రహం ఒక్క సారి భగ్గుమంది. పలువురు నాయకులు పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. ఇక బీజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారయణైతే బహిరంగంగానే సోమూ వీర్రాజుపై ఆగ్రహం వెళ్ళగక్కాడు.

సోమూ వీర్రాజు అధ్యక్షుడయ్యాక కన్నా కు ప్రాధాన్యత తగ్గింది. కార్యక్ర‌మాల్లో ఆయనను ఇన్వాల్వ్ చేయడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. దీనిపై కోపంగా ఉన్న 'కన్నా' కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నాడు. పవన్ కళ్యాణ్ కు దగ్గరవుతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. జనసేన లో నెంబర్ టూ గా ఉన్న నాదెండ్ల మనోహర్ తో సమావేశం కూడా అయ్యారు. పైగా సమయం దొరికినప్పుడల్లా సోమూ వీర్రాజుమీద సెటైర్ లు వేస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్షుల మార్పు నిర్ణయం కన్నాకు పుండు మీద కారంలా మారింది. వీర్రాజు తొలగించిన‌ మెజార్టీ అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ అధ్యక్షుడుగా ఉండగా నియమించిన వారే.

ఈ పరిణామంతో మండిపోయిన కన్నా ఈ రోజు ఏకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి సోమూ వీర్రాజుపై, ఎంపీ జీవీఎల్ నర్సింహా రావుపై విరుచుకపడ్డాడు. సోమూ వీర్రాజు వియ్యంకుడు వెళ్ళి బీఆరెస్ లో చేరితే సోమూ వీర్రాజు ఏం చేస్తున్నాడు ? అని ప్రశ్నించారు కన్నా. నేను రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఎంతో మందిని బీజేపీలో జాయిన్ చేశాను. ఇప్పుడు వాళ్లంతా ఎందుకు పార్టీ వీడుతున్నారో వీర్రాజు సమాధానం చెప్పాలి. అధ్యక్షుల మార్పు నాతో చర్చించలేదు. ఇప్పుడు తొలగించిన వాళ్లంతా నేను నియమించిన వాళ్లే. అసలు పార్టీలో కార్యకరమాల గురించి ఏ సమాచారం నాకు తెలియడం లేదు.'' అని కన్నా లక్ష్మీ నారాయణ మండిపడ్డారు.

ఇక జీవీఎల్ ఆలోచన ఎప్పుడూ కార్యకర్తల అభిప్రాయాలకు విరుద్దంగానే ఉంటుందని, అమరావతి రాజధాని సహా అనేక అంశాలలో జీవీఎల్ వైఖరి అలాగే ఉంది అని కన్నా అన్నారు.

చివరగా కన్నా లక్ష్మీ నారాయణ‌ , తాను పవన్ కళ్యాణ్ కు అండగా నిలబడతానని ప్రకటించారు. ఈ మాట బీజేపీ వర్గాల్లో అనేక చర్చలకు కారణమవుతోంది. దీన్నిబట్టి కన్నా బీజేపీకి రాజీనామా చేసి జనసేనలో చేరతాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అంతే కాక సోమూ వీర్రాజు తీరుపై బీజేపీలోని పలువురు ఇతర నేతలు కూడా ఆగ్రహంగా ఉన్నారు. మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు లాంటి వాళ్లు వీర్రాజు తీరుతోనే పార్టీకి గుడ్‌బై చెప్పి బీఆరెస్ లో చేరారని బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు.

First Published:  4 Jan 2023 11:22 AM GMT
Next Story