పుస్తకాలతో ఓట్లు పడతాయా..? చంద్రబాబు బ్లాక్ అండ్ వైట్ కాలం తెలివితేటలు
చంద్రబాబు జైలు జీవితం తర్వాత విడుదలవుతున్న తొలి పుస్తకం ఇదే అయినా.. ఇందులో ఆయన జైలు కథ మాత్రం ఉండదట. ఆయన తప్పులన్నీ కప్పిపుచ్చి, కేవలం గొప్పలు చెప్పుకోడానికే ఈ పుస్తకాన్ని ఇప్పుడు విడుదల చేస్తున్నారనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.
ఎన్నికలొస్తున్నాయంటే అనుకూల మీడియాతో పుంఖాను పుంఖాలుగా వార్తలు రాయించుకోవడం పాత పద్ధతి. ఇప్పటికీ రాజకీయ పార్టీలు ఈ పద్ధతిని ఫాలో అవుతున్నా, సోషల్ మీడియాలో పెయిడ్ ప్రచారం వీటికి అదనంగా మారింది. అయితే అప్పట్లో వార్తలతోపాటు ప్రత్యేకంగా పుస్తకాలు కూడా రెడీమేడ్ గా ఎన్నికలప్పుడు విడుదలవుతుండేవి. ఇప్పుడు కూడా చంద్రబాబు అదే ఫార్ములా ప్రయోగించాలని చూస్తున్నారు. తాజాగా ఆయనపై ఓ కొత్త పుస్తకం రూపొందింది. ‘డీకోడింగ్ ద లీడర్’ అనే పేరుతో వస్తున్న ఈ పుస్తకాన్ని ఈనెల 16న అధికారికంగా ఆవిష్కరిస్తారు.
జైలు జీవితం తర్వాత తొలి పుస్తకం..
గతంలో కూడా చంద్రబాబుపై చాలామంది పుస్తకాలు రాశారు. ఆ మాటకాస్తే ఎన్టీఆర్ కి పోటీగా చంద్రబాబు తన గురించి పుస్తకాలు రాయించుకున్నారు. వాటి విడుదల సమయంలో హడావిడి జరిగినా, తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా చంద్రబాబు ఎన్నికల వేళ ఓ పుస్తకం రాయించారు. చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ అనుభవం, నాయకత్వ లక్షణాలు, పరిపూర్ణ వ్యక్తిత్వం గురించి ఈ పుస్తకం తెలియజేస్తుందంటూ అప్పుడే ఎల్లో మీడియా బాకాలూదడం మొదలు పెట్టింది. చంద్రబాబు జైలు జీవితం తర్వాత విడుదలవుతున్న తొలి పుస్తకం ఇదే అయినా.. ఇందులో ఆయన జైలు కథ మాత్రం ఉండదట. ఆయన తప్పులన్నీ కప్పిపుచ్చి, కేవలం గొప్పలు చెప్పుకోడానికే ఈ పుస్తకాన్ని ఇప్పుడు విడుదల చేస్తున్నారనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ పాతకాలం ఫార్ములాలు ఓట్ల రూపంలో మారతాయా, ఆయన పాపాలు కడిగేస్తాయా అనేది తేలాల్సి ఉంది.
విభజన అనంతరం ఏపీని దేశంలోనే అగ్రగామిగా మార్చాలని చంద్రబాబు చేసిన ప్రయత్నంలో ఎదుర్కొన్న సమస్యలు.. వాటిని ఆయన ఎలా పరిష్కరించారనే అంశాలను ఈ పుస్తకంలో రచయిత చర్చించారట. లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో కియా మోటార్స్ ను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు తపన పడ్డారని, అరకు కాఫీని ప్రపంచ బ్రాండ్ గా నిలపాలని చంద్రబాబు కలలు కనేవారని, గిరిజనులకు మంచి ఉపాధి అవకాశాలు రావాలని తపించారంటూ ఈ పుస్తకంలో భజన ఉంటుందని సమాచారం.