గంటల వ్యవధిలో మామ, కోడలు మృత్యువాత - ఇద్దరూ గుండెపోటుతో కన్నుమూత
ఊహించని ఘటనతో ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. తండ్రి చనిపోయిన బాధలో ఉన్న మాణిక్యాలరావుకు కిరణ్మయి కూడా మృతిచెందడం తట్టుకోలేని షాక్‌లా మారింది. కుటుంబ సభ్యులు ఉదయం మామ వెంకట్రావుకు, సాయంత్రం కిరణ్మయికి అంత్యక్రియలు నిర్వహించారు.
తండ్రిలా చూసుకుంటున్న మామగారు మృతిచెందడటాన్ని జీర్ణించుకోలేకపోయిన కోడలు ఆయన మృతదేహం వద్దే రోదిస్తూ మృతిచెందింది. గంటల వ్యవధిలో చోటుచేసుకున్న మరణాలు ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచేశాయి. పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం జిన్నూరులో జరిగిన ఈ ఉదంతానికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
జిన్నూరు పెదపేటకు చెందిన రిటైర్డ్ వెటర్నరీ అసిస్టెంట్ కాటం వెంకట్రావు (85) శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో మృతిచెందారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చిన్నకుమారుడు మాణిక్యాలరావు మినహా మిగిలినవారంతా వేర్వేరు గ్రామాల్లో ఉంటున్నారు. ఆయన భార్య 30 ఏళ్ల క్రితమే మృతిచెందారు. ప్రస్తుతం వెంకట్రావు చిన్న కుమారుడి కుటుంబంతో కలిసి ఉంటున్నారు.
వెంకట్రావు మృతితో శనివారం ఉదయం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకున్నారు. శుక్రవారం రాత్రంతా కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహం వద్దే ఉన్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి నిద్రాహారాలు లేకుండా మృతదేహం వద్ద రోదిస్తున్న కోడలు కిరణ్మయి (39) ఉదయం 6.30 గంటల సమయంలో గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
ఊహించని ఘటనతో ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. తండ్రి చనిపోయిన బాధలో ఉన్న మాణిక్యాలరావుకు కిరణ్మయి కూడా మృతిచెందడం తట్టుకోలేని షాక్‌లా మారింది. ఆయన కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కిరణ్మయి తణుకు మహిళా కళాశాలలో లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మాణిక్యాలరావు ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఉదయం సమయంలో మామ వెంకట్రావుకు, సాయంత్రం కిరణ్మయికి అంత్యక్రియలు నిర్వహించారు.