Telugu Global
Andhra Pradesh

బాలుడిని కిడ్నాప్ చేసిన దస్తగిరి

దస్తగిరి భార్య కూడా ఫోన్ చేసి వెంటనే డబ్బులు తీసుకురాకపోతే చంపేస్తామని బెదిరించినట్టు గులాబీ వివరించారు. దాంతో గులాబీ పులివెందుల పోలీసులను ఆశ్రయించారు.

బాలుడిని కిడ్నాప్ చేసిన దస్తగిరి
X

వైఎస్‌ వివేకానందరెడ్డి కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి మరో వివాదంలో చిక్కుకున్నాడు. అప్పు ఇచ్చి వసూలు చేసుకునేందుకు ఒక బాలుడిని కిడ్నాప్ చేశాడు. పులివెందుల జయమ్మ కాలనీలో దస్తగిరి నివాసం ఉంటున్నారు. అదే వీధిలో ఉంటున్న పెద్దగూగుడు వల్లీ, షేక్ గులాబీ దంపతులు ఆరు నెలల క్రితం పెద్ద వడ్డీకి దస్తగిరి వద్ద 40వేల రూపాయ‌లు అప్పు తీసుకున్నారు. వారం వారం వడ్డీ చెల్లిస్తూ వచ్చారు. కొద్ది రోజుల తర్వాత సక్రమంగా వడ్డీ కట్టలేకపోయారు. దాంతో వడ్డీ, అసలు కలిపి లక్షా 10వేల రూపాయలకు దస్తగిరి ప్రామిసరీ నోట్ రాయించుకున్నాడు.

ఆ డబ్బు మొత్తం చెల్లించాలని ఇటీవల ఒత్తిడి తెస్తున్నాడు. ఈనెల 13న చెల్లిస్తామని షేక్ గులాబీ దంపతులు హామీ ఇచ్చారు. కానీ సమయానికి డబ్బును సమకూర్చలేకపోయారు. దాంతో షేక్ గులాబీ దంపతులు ఊరెళ్లిన సమయంలో వారి కుమారుడు చిన్న గూగుడు వల్లీని దస్తగిరి తీసుకెళ్లి తన ఇంట్లో బంధించాడు. వెంటనే వచ్చి డబ్బు చెల్లించకపోతే నీ కొడుకును చిత్రహింసలు పెడుతా అంటూ ఫోన్‌లో బెదిరించాడు. అదే సమయంలో పిల్లాడిని కొడుతూ అతడితోనూ ఫోన్‌లో మాట్లాడించాడని బాధితురాలు చెబుతున్నారు.

దస్తగిరి భార్య కూడా ఫోన్ చేసి వెంటనే డబ్బులు తీసుకురాకపోతే చంపేస్తామని బెదిరించినట్టు గులాబీ వివరించారు. దాంతో గులాబీ పులివెందుల పోలీసులను ఆశ్రయించారు. సీఐ హుస్సేన్ నేరుగా దస్తగిరి ఇంటికి వెళ్లి అక్కడ నిర్బంధంలో ఉన్న బాలుడిని విడిపించి తీసుకొచ్చారు. ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. దస్తగిరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. తనపై అన్యాయంగా కేసు పెడుతున్నారని దస్తగిరి ఆరోపిస్తున్నారు.

First Published:  20 Jun 2023 10:06 AM IST
Next Story