తీరం దాటిన మిచౌంగ్..చెన్నైలో 8 మంది మృతి
చెన్నైలో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఇంకా చాలా ప్రాంతాలు వరద నీటిలోనే ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకూ చెన్నైలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఏపీ, తమిళనాడు రాష్ట్రాలను భయపెడుతున్న మిచౌంగ్ తుపాన్ తీరం దాటింది. బాపట్ల సమీపంలో మిచౌంగ్ తీరం దాటింది. తుపాన్ ప్రభావంతో ఏపీలో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాన్ తీరాన్ని తాకిన సమయంలో 90-110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. తీరప్రాంతం అల్లకల్లోలంగా మారింది. ఈ పరిస్థితి మూడు-నాలుగు గంటల వరకు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇప్పటికే 8 జిల్లాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జాబితాలో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాలు ఉన్నాయి. తుపాన్ ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది ఏపీ సర్కార్. ఒక్కో అధికారికి రెస్క్యూ, రిలీఫ్ వర్క్స్ కోసం రూ.2 కోట్లు రిలీజ్ చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 200 రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఇక పుదుచ్చేరి కోస్తా తీరంలో 144 సెక్షన్ విధించారు.
చెన్నైలో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఇంకా చాలా ప్రాంతాలు వరద నీటిలోనే ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకూ చెన్నైలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్‌పోర్టులో ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇక ఒడిశాలోనూ కోస్తా ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా రెస్క్యూ టీమ్స్‌ను అందుబాటులో ఉంచారు. ఒడిశా దక్షిణ జిలాల్లో మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు.