Telugu Global
Andhra Pradesh

ఆర్‌-5 జోన్‌ లేఅవుట్‌ వద్ద గాలివాన బీభత్సం

గాయపడిన వారిలో బందోబస్తుకు వచ్చిన ఎస్‌ఐ వీర నాగేశ్వరరావు, హెడ్‌ కానిస్టేబుల్ విజయరాజు కూడా ఉన్నారు. గాయపడిన వారిని మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించారు.

ఆర్‌-5 జోన్‌ లేఅవుట్‌ వద్ద గాలివాన బీభత్సం
X

అమరావతిలో పేదల ఇళ్ల స్థలాల కోసం నిర్దేశించిన ఆర్‌ 5జోన్‌లోని లే అవుట్‌ వద్ద గాలివాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా గాలివాన రావడంతో టెంట్లు కూలిపోయాయి. దాంతో 27 మంది గాయపడ్డారు. మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలోని లే అవుట్‌లో ఈ ఘటన జరిగింది.

లే అవుట్‌ వద్ద దాదాపు 200 మంది పనిచేస్తున్నారు. శనివారం ఎండ వేడి పెరగడంతో కార్మికులు, కూలీలు అక్కడే ఏర్పాటు చేసిన భారీ షెడ్‌ వద్దకు వెళ్లారు. అంతలోనే ఒక్కసారిగా వాతావరణం చల్లబడి భారీ గాలి వచ్చింది. వర్షం మొదలైంది. ఒక్కసారిగా గాలివానకు షెడ్‌ కూలిపోయింది. దాంతో దాని కింద ఉన్న కూలీలు, కార్మికులు గాయపడ్డారు. ఒకరిపై ఒకరు పడ్డారు. నల్ల రేగడి భూమి పూర్తిగా బురదమయం కావడంతో తప్పించుకుని బయటకు వచ్చేందుకు చాలా కష్టపడ్డారు.

గాయపడిన వారిలో బందోబస్తుకు వచ్చిన ఎస్‌ఐ వీర నాగేశ్వరరావు, హెడ్‌ కానిస్టేబుల్ విజయరాజు కూడా ఉన్నారు. గాయపడిన వారిని మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించారు. బురదమయం కావడంతో అంబులెన్స్‌లు ఘటన స్థలికి దూరంగానే ఆపాల్సి వచ్చింది. చికిత్స పొందుతున్న వారిని కలెక్టర్‌ వేణుగోపాల్ రెడ్డి పరామర్శించారు.

First Published:  21 May 2023 8:25 AM IST
Next Story