Telugu Global
Andhra Pradesh

రివర్స్‌ కొట్టిన చంద్రబాబు 'ఖర్మ' ?

దెందులూరు అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరే. టీడీపీ అధికారంలో ఉన్నపుడు చింతమనేని అరాచకానికి కేరాఫ్ అడ్రస్ గా ఉండేవారు.

రివర్స్‌ కొట్టిన చంద్రబాబు ఖర్మ ?
X

40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడులో ఆలోచించే శక్తి పోయినట్లుంది. అందుకనే 'ఇదేం ఖర్మ.. రాష్ట్రానికి' అనే కార్యక్రమాన్ని పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నుండి మొదలుపెట్టారు. చంద్రబాబు శ్రీకారం చుట్టిన నియోజకవర్గంలోనే ఇదేం ఖర్మరా మనకు అని జనాలు అనుకునేట్లుగా తయారైంది. ఇంతకీ విషయం ఏమిటంటే.. దెందులూరులో జగన్మోహన్ రెడ్డి పాలనలో అరాచకాలు, దౌర్జన్యాలు, దాడుల గురించి చంద్రబాబు చాలా మాట్లాడారు.

సరే, చంద్రబాబు మాట్లాడిందాంట్లో కొత్తేమీలేదు. జగన్ అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ళుగా చంద్రబాబు ఇలాంటి ఆరోపణలే చేస్తున్నారు. అయితే ఇలాంటి ఆరోపణలను తాను ఎక్కడనుండి చేస్తున్నాననే కనీస స్పృహకూడా చంద్రబాబులో లేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. దెందులూరు అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరే. టీడీపీ అధికారంలో ఉన్నపుడు చింతమనేని అరాచకానికి కేరాఫ్ అడ్రస్ గా ఉండేవారు.

అధికారాన్ని అడ్డుపెట్టుకుని చింతమనేని చేయని దుర్మార్గం లేదు. మగా, ఆడ తేడాలేకుండా ఎవరు పడితే వారిపై దాడులు చేసి కొట్టేవాడు. ఎమ్మార్వో వనజాక్షిని అందరిముందు జుట్టుపట్టుకుని కొట్టిన ఘటనలోనే మొదటిసారి చింతమనేని రాష్ట్రానికి పరిచయమయ్యాడు. తర్వాత పోలీసులను కొట్టాడు. ఫారెస్టు అధికారులను కొట్టాడు. రెవెన్యు సిబ్బందిపై దౌర్జన్యం చేశాడు. ఎస్సీలను బహిరంగంగానే నోటికొచ్చినట్లు తిట్టిన వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్ లో దొరుకుతాయి. బాధితులు ఎవరైనా తనమీద కేసుపెట్టడానికి పోలీసుస్టేషన్ కు వెళితే వాళ్ళమీదే రివ‌ర్స్ కేసుపెట్టించి స్టేషన్లోనే కొట్టించిన ఘటనలు చాలా ఉన్నాయి.

చివరకు చింతమనేని అరాచకాలను సహించలేక ఏలూరు పోలీసులు ఈయనపై రౌడీషీటర్ ఓపెన్ చేశారు. అదికూడా టీడీపీ హయాంలోనే జరిగింది. చంద్రబాబు మద్దతుతోనే చింతమనేని అరాచకవాదిలా తయారైపోయారు. అలాంటి చింతమనేనిని దెందులూరులో చంద్రబాబు తనపక్కనే నించోబెట్టుకుని జగన్ అరాచకాలపై మాట్లాడితే జనాలు ఒప్పుకుంటారా..? చంద్రబాబు ఆరోపిస్తున్న జగన్ అరాచకాలు దెందులూరు జనాలకు అనుభవంలోకి వచ్చిందో.. లేదో.. తెలీదు. కానీ తమను అష్టకష్టాలకు గురిచేసిన అరాచకవాదిని పక్కన పెట్టుకుని మాట్లాడి జనాలకు చంద్రబాబు ఏమి సిగ్నల్ పంపినట్లు..?

First Published:  1 Dec 2022 11:58 AM IST
Next Story