రాజకీయాల్లోకి క్రికెటర్ అంబటి రాయుడు.. వైఎస్ జగన్‌తో భేటీ
మ్యాచ్ ముగిసిన తర్వాత ఆంధ్రాకి వచ్చిన రాయుడు ఈరోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌ని కలిశారు. దాంతో అతను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు స్పష్టమైంది.
భారత క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం ఐపీఎల్- 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున అంబటి రాయుడు ఆడుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం రాత్రి చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లోనూ అంబటి రాయుడు పాల్గొన్నాడు. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆంధ్రాకి వచ్చిన రాయుడు ఈరోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌ని కలిశారు. దాంతో అతను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు స్పష్టమైంది.
వాస్తవానికి అంబటి రాయుడు తొలుత జనసేనలో చేరుతారని జోరుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరబోతున్నట్లు కూడా ఊహాగానాలు వినిపించాయి. కానీ.. కాపు సామాజిక వర్గానికి చెందిన రాయుడు ఇటీవల సీఎం వైఎస్ జగన్ స్పీచ్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ గ్రేట్ స్పీచ్ అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. దాంతో అతను వైసీపీలో చేరబోతున్నట్లు తేలిపోయింది.
అంబటి రాయుడి స్వస్థలం గుంటూరు జిల్లా పొన్నూరు. వచ్చే ఎన్నికల్లో జిల్లా నుంచి వైసీపీ తరఫున పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే.. సీఎం వైఎస్ జగన్ నుంచి అతనికి పూర్తి స్థాయిలో ఇంకా క్లారిటీ వచ్చినట్లు లేదు. దాంతో అంబటి రాయుడు వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేస్తారా? లేదా ప్రచారానికే పరిమితం అవుతారా? అనేది తేలాల్సి ఉంది.