జనసేనలోకి అంబటి రాయుడు..!
రాయుడు ఇవాళ అందరినీ ఆశ్చర్యపరుస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. అరగంటకు పైగా వీరిద్దరూ చర్చలు జరిపారు. అంబటి రాయుడు జనసేనలో చేరేందుకే పవన్ కళ్యాణ్ తో భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీలో చేరిన 10 రోజులకే ఆ పార్టీకి రాజీనామా చేసిన అంబటి.. ముంబై తరఫున క్రికెట్ లీగ్ ఆడేందుకే రాజకీయాలకు దూరం అవుతున్నట్లు ప్రకటించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐపీఎల్ లో చాలా ఏళ్లు ముంబై తరఫున ఆడిన అంబటి ఆ తర్వాత ధోనీ సారథ్యంలోని సీఎస్కే జట్టులోకి వచ్చారు. గత ఏడాది ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత అంబటి రాయుడు ఈ లీగ్ కు రిటైర్మెంట్ ప్రకటించారు.
అప్పట్నుంచి ఏపీ రాజకీయాల పట్ల రాయుడు ఆసక్తిగా ఉన్నారు. పలుమార్లు జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రశంసించారు. ఆ తర్వాత అంబటి రాయుడు సీఎం జగన్ తో భేటీ అయి ఆ పార్టీలో చేరారు. గుంటూరు లోక్ సభ టికెట్ ను అంబటి రాయుడు ఆశించారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ, అనూహ్యంగా పార్టీలో చేరిన పది రోజులకే వైసీపీకి అంబటి రాయుడు రాజీనామా చేశారు. ముంబై తరపున క్రికెట్ లీగ్ ఆడేందుకే రాజకీయాలకు దూరం అవుతున్నట్లు ఆ తర్వాత ప్రకటించారు.
ఇదిలా ఉంటే రాయుడు ఇవాళ అందరినీ ఆశ్చర్యపరుస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. అరగంటకు పైగా వీరిద్దరూ చర్చలు జరిపారు. అంబటి రాయుడు జనసేనలో చేరేందుకే పవన్ కళ్యాణ్ తో భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. గుంటూరు ఎంపీ టికెట్ పై హామీ లభించకపోవడంతోనే అంబటి రాయుడు వైసీపీని వీడి బయటకు వచ్చారని, ప్రస్తుతం అదే స్థానం నుంచి పోటీ చేసేందుకే జనసేనలో చేరుతున్నారని ప్రచారం జరుగుతోంది.