Telugu Global
Andhra Pradesh

'జాకీ'కి మద్దతుగా సీపీఐ ఆందోళన?.. - నెటిజన్ల విమర్శలు

కంపెనీ ఏర్పాటు చేయాలనుకున్న ప్లాంట్ స్థలం వద్దకు తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తన అనుచరగణంతో వెళ్లారు. రాప్తాడు ఎమ్మెల్యే వేధింపుల వల్లే ఇక్కడ పెట్టవలసిన కంపెనీ వెనక్కి వెళ్లిపోయిందని ఆయన ఆరోపించారు.

జాకీకి మద్దతుగా సీపీఐ ఆందోళన?.. - నెటిజన్ల విమర్శలు
X

సాధారణంగా కమ్యూనిస్టు పార్టీలు పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటాయి. పెట్టుబడిదారులు పేదల భూములు లాక్కొని కంపెనీల ఏర్పాటు పేరుతో సమాజంలో అంతరాలు పెంచుతారన్నది వాళ్ల ఆరోపణ. గతంలో అనేక సెజ్ లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు ఎన్నో పోరాటాలు చేశారు. అయితే తాజాగా ఏపీలో ఓ కంపెనీకి అనుకూలంగా సీపీఐ ఆందోళన చేయడం గమనార్హం.

వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే వేధింపులు భరించలేకే అనంతపురం జిల్లా రాప్తాడులో పెట్టాలనుకున్న జాకీ పరిశ్రమ యూనిట్ వెనక్కి వెళ్లిపోయిందని ఇటీవల పచ్చ మీడియాలో జోరుగా ప్రచారం సాగిన విషయం తెలిసిందే. అయితే దాన్ని వైసీపీ నేతలు ఖండించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మంత్రులు లోకేశ్, పరిటాల సునీత వేధింపులు తట్టుకోలేక ఆ కంపెనీ వెనక్కి వెళ్లిపోయిందన్నది రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆరోపణ..

ఇదిలా ఉంటే సదరు కంపెనీ ఏర్పాటు చేయాలనుకున్న ప్లాంట్ స్థలం వద్దకు తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తన అనుచరగణంతో వెళ్లారు. రాప్తాడు ఎమ్మెల్యే వేధింపుల వల్లే ఇక్కడ పెట్టవలసిన కంపెనీ వెనక్కి వెళ్లిపోయిందని ఆయన ఆరోపించారు. కాగా రామకృష్ణ తీరుపట్ల నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కంపెనీలకు, భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన సీపీఐ నేతలు.. వారికి అనుకూలంగా వ్యవహరించడం ఎప్పుడు మొదలుపెట్టారని ప్రశ్నిస్తున్నారు.

First Published:  22 Nov 2022 10:55 AM GMT
Next Story