Telugu Global
Andhra Pradesh

కర్నూలులో హైకోర్టుకు సీపీఐ మద్దతు

ఒకవైపు హైకోర్టు కర్నూలులో ఏర్పాటుకు అభ్యంతరం లేదని చెబుతునే మరోవైపు సీపీఐ.. చంద్రబాబుకు మద్దతుగా నిలబడుతుండటమే చాలా విచిత్రంగా ఉంది. ఇదంతా చూస్తుంటే బీజేపీ, సీపీఐ అయోమయంలో ఉన్నాయా ? లేకపోతే జనాల్లో గందరగోళం సృష్టిస్తున్నాయా

కర్నూలులో హైకోర్టుకు సీపీఐ మద్దతు
X

మూడురాజధానుల విషయంలో ప్రతిపక్షాల్లో మెల్లగా మార్పు వస్తున్నట్లే ఉంది. కడప ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో సీపీఐ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు అభ్యంతరం లేదని చెప్పారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీకి తప్ప మరేపార్టీకి అభ్యంతరం లేదని, మిగిలిన పార్టీల తరపున వకాల్తా కూడా పుచ్చుకున్నారు. ఈమధ్యనే ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాట్లాడుతూ కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంటే కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని చెప్పారు.

ఒకప్పుడు హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీతో పాటు యావత్ డెవలప్మెంట్ మొత్తం అమరావతిలోనే ఉండాలని ప్రతిపక్షాలు డిమాండ్లు చేసిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ఏమి డిమాండ్ చేస్తే టీడీపీకి వంత‌పాడే పార్టీలు అవే డిమాండ్లు చేస్తూవ‌చ్చాయి. అలాంటిది ఇప్పుడు ప్రతిపక్షాల్లో మెల్లగా మార్పులు వస్తున్నట్టు అర్థ‌మవుతోంది. అయితే ఇంకా జనాలకు అర్థంకాని విషయం ఏమిటంటే ఒకవైపు కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు అభ్యంతరం లేదని చెబుతున్న ప్రతిపక్షాలు ఇంకా టీడీపీతోనే కలిసి ఎందుకు నడుస్తున్నాయని.

చంద్రబాబు నాయుడు డిమాండ్ ప్రకారం హైకోర్టు, సచివాలయాన్ని అమరావతి నుండి కదిల్చేందుకు లేదు. కానీ, బీజేపీ, సీపీఐ కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు అభ్యంతరం లేదని స్పష్టంగా ప్రకటించాయి. ఇక్కడే టీడీపీ-బీజేపీ, సీపీఐ మధ్య స్పష్టమైన తేడా కనబడుతోంది. ఇదే సమయంలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు ప్రతిపాదించిన ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడటానికి బీజేపీ, సీపీఐ ఇష్టపడటంలేదు.

ఒకవైపు హైకోర్టు కర్నూలులో ఏర్పాటుకు అభ్యంతరం లేదని చెబుతునే మరోవైపు సీపీఐ.. చంద్రబాబుకు మద్దతుగా నిలబడుతుండటమే చాలా విచిత్రంగా ఉంది. ఇదంతా చూస్తుంటే బీజేపీ, సీపీఐ అయోమయంలో ఉన్నాయా ? లేకపోతే జనాల్లో గందరగోళం సృష్టిస్తున్నాయా అన్నదే అర్థం కావటంలేదు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని రాయలసీమ గర్జన పేరుతో తిరుపతిలో భారీ ర్యాలీ, సభ జరిగింది. మళ్ళీ ఈ కార్యక్రమంలో బీజేపీ, సీపీఐ నేతలు పత్తాలేరు. మొత్తానికి ప్రభుత్వ ప్రతిపాదనకు బహిరంగంగా మద్దతు ప్రకటించలేక అలాగని పూర్తిగా వ్యతిరేకించలేక బీజేపీ, సీపీఐ నానా అవస్థ‌లు పడుతున్నట్లు అర్థ‌మవుతోంది.

First Published:  30 Oct 2022 9:38 AM IST
Next Story