ప్రమాదాలు జరుగుతాయని ప్రయాణాలు మానుకుంటారా..?
ఏపీలో ర్యాలీలు, సభలు, సమావేశాలు, రోడ్ షోలు జరపకూడదని జీవో ఇవ్వడం దుర్మార్గం అని అన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ. జగన్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని విమర్శించారు.
ఏపీలో రోడ్లపై, రోడ్డు కూడళ్లలో సభలు, ర్యాలీలపై నిషేధం విధించింది రాష్ట్ర ప్రభుత్వం. కందుకూరు, గుంటూరు దుర్ఘటనలను దృష్టిలో ఉంచుకుని, ప్రజల ప్రాణాలను రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది హోంశాఖ. ఈ నిర్ణయంతో ఎక్కువ ప్రభావితం అయ్యేది టీడీపీ. ఎందుకంటే ప్రస్తుతం చంద్రబాబు ఇదేం ఖర్మ కార్యక్రమంలో ఊరూవాడా తిరుగుతున్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, రోడ్ షో లు, సభలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు ఇకపై అనుమతులు ఉండకపోవచ్చు. అయితే టీడీపీ కంటే ముందు బీజేపీ, సీపీఐ ప్రభుత్వ నిర్ణయంపై ఘాటుగా స్పందించాయి. ప్రమాదాలు జరుగుతాయని ప్రయాణాలు వాయిదా వేసుకుంటామా అని ప్రశ్నించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.
ఏపీలో ర్యాలీలు, సభలు, సమావేశాలు, రోడ్ షోలు జరపకూడదని జీవో ఇవ్వటం దుర్మార్గం అని అన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ. జగన్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని విమర్శించారు. కందుకూరు, గుంటూరు ప్రమాద ఘటనలను సాకుగా చూపి జగన్ సర్కార్ తీసుకున్న నిరంకుశ నిర్ణయంగా దీన్ని అభివర్ణించారు. ప్రజా ఉద్యమాలను, ప్రశ్నించే గొంతుకలను, ప్రతిపక్షాలను అణచివేసే కుట్రలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో సభలు పెట్టుకునేందుకు అనుమతి ఇస్తామంటున్నారని, అంటే వైసీపీ శ్రేణులకు మాత్రమే ప్రత్యేక పరిస్థితులు వర్తిస్తాయని చెప్పారు.
సభలు సమావేశాలు నిర్వహించడం రాజకీయ పార్టీల హక్కు అని అన్నారు ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఎవరూ రోడ్లపైకి రాకూడదనే ఉద్దేశంతో రాజకీయం కోణంలో వైసీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారాయన. తప్పు చేసిన వ్యక్తులు, పార్టీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందరినీ ఒకే గాటన కట్టేసి.. సభలు, రోడ్ షో లపై నిషేధం విధించడం సరికాదన్నారు.
టీడీపీ, జనసేన ఈ వ్యవహారంపై స్పందించాల్సి ఉంది. ప్రభుత్వ నిర్ణయం లోకేష్ యువగళంపై పడుతుందా, పవన్ కల్యాణ్ వారాహి యాత్రపై ఉంటుందా అనేది వేచి చూడాలి.