ఏపీలో కొవిడ్ అలర్ట్.. సీఎం జగన్ అత్యవసర సమీక్ష
JN–1 వేరియంట్ అంత ప్రమాదకారి కాదు అని సీఎం జగన్ సమీక్షలో అధికారులు తెలిపారు. ఈ వేరియంట్ వల్ల ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు. ఆస్పత్రిలో చేరే పరిస్థితులు లేకుండానే రికవరీ అవుతున్నారని వివరించారు.
దేశవ్యాప్తంగా JN–1 కొత్త వేరియంట్ అలజడి కనపడుతోంది. కేసులు నమోదైన రాష్ట్రాలు, వాటి పక్క రాష్ట్రాలు.. అన్ని చోట్లా హడావిడి మొదలైంది. ఏపీలో ప్రస్తుతానికి కొత్త వేరియంట్ జాడ కనపడకపోయినా ప్రభుత్వం అలర్ట్ అయింది. సీఎం జగన్ ఈరోజు అత్యవసర సమీక్ష నిర్వహించారు. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, అధికారులతో చర్చించారు.
వైద్య ఆరోగ్యశాఖ తెల్పిన ముఖ్యాంశాలు :
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) December 22, 2023
కోవిడ్ కొత్త వేరియంట్ JN.1 గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా, ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే ఈ వేరియంట్ సోకినవారు కోలుకుంటున్నారు.
డెల్టా వేరియంట్ తరహా లక్షణాలు JN.1కు లేవు.#COVID19#JN1 https://t.co/9ElPCAAHfF
ఏపీలోనూ కేసులు..
కేరళ, ఇతర రాష్ట్రాల్లో కొత్తవేరియంట్ కేసులు నమోదవుతుండగా.. ఆంధ్రప్రదేశ్ లోనూ కొవిడ్ పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. ఏలూరు జిల్లాలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి వైద్యుడికి కరోనా పాజిటివ్ రాగా, అతని శాంపిల్స్ ను హైదరాబాద్ ల్యాబ్ కు పంపారు. JN–1 వేరియంట్ సోకిందేమోననే అనుమానంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అంత ప్రమాదకారి కాదు..
JN–1 వేరియంట్ అంత ప్రమాదకారి కాదు అని సీఎం జగన్ సమీక్షలో అధికారులు తెలిపారు. ఈ వేరియంట్ వల్ల ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు. ఆస్పత్రిలో చేరే పరిస్థితులు లేకుండానే రికవరీ అవుతున్నారని వివరించారు. అయితే JN–1కు వేగంగా విస్తరించే లక్షణం ఉందని తెలిపారు అధికారులు. ప్రభుత్వ పరంగా ముందస్తు చర్యల్లో భాగంగా ఆక్సిజన్ ఇన్‌ఫ్రాను సిద్ధంచేస్తున్నామని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. కొత్త వేరియంట్ పై కేంద్రం కూడా అప్రమత్తత ప్రకటించిన నేపథ్యంలో అధికారులు మరింత అలర్ట్ గా ఉండాలని సూచించారు సీఎం జగన్. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను, విలేజ్ క్లినిక్ వ్యవస్ధను ముందస్తు చర్యలకోసం అలర్ట్ చేయాలన్నారు. కొత్త వేరియంట్ లక్షణాలు, తీసుకోవాల్సిన చర్యలపై విలేజ్ క్లినిక్స్ స్టాఫ్ కు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
తిరుమలలో అలర్ట్..
కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తిరుమలలో కూడా అధికారులు అలర్ట్ ప్రకటించారు. టీటీడీ కౌంటర్లలో కొవిడ్ ప్రోటోకాల్ పాటిస్తున్నారు. కౌంటర్ల దగ్గర కొవిడ్ జాగ్రత్తలపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కౌంటర్ల దగ్గర నో మాస్క్ నో ఎంట్రీ బోర్డులు పెట్టి చర్యలు తీసుకుంటున్నారు.