చంద్రబాబు సీఐడీ కస్టడీకి కోర్టు గ్రీన్ సిగ్నల్
చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఏపీ హైకోర్టు తీర్పు చెప్పింది. దీంతో ఏసీబీ కోర్టు కూడా తమ నిర్ణయాన్ని వెల్లడించింది.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టీడీపీ చీఫ్, మాజీ సీఎం చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వడానికి ఏసీబీ కోర్టు అంగీకరించింది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును విచారించడానికి ఐదు రోజుల పాటు కస్టడీ కావాలని సీఐడీ పిటిషన్ వేసింది. చంద్రబాబు నోరు విప్పితేనే ఈ కేసులో కీలక విషయాలు బయటకు వస్తాయని సీఐడీ కోర్టుకు చెప్పింది. కాగా, గురువారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు జడ్జి.. క్వాష్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున.. దీనిపై శుక్రవారం తీర్పు చెప్తానని వాయిదా వేశారు.
తాజాగా చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఏపీ హైకోర్టు తీర్పు చెప్పింది. దీంతో ఏసీబీ కోర్టు కూడా తమ నిర్ణయాన్ని వెల్లడించింది. చంద్రబాబును స్కిల్ స్కామ్‌లో రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఇచ్చింది. ప్రస్తుతం చంద్రబాబు ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైలులోనే విచారణ చేపట్టాలని సీఐడీకి ఆదేశాలు ఇచ్చింది. శని, ఆదివారాల్లో జైలులో విచారించడానికి ఓకే చెప్పింది. అంతకు ముందు విచారణ అధికారుల జాబితాను ఇవ్వాలని సీఐడీని ఆదేశించింది.
చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ రోజుతో ఆయన 14 రోజుల రిమాండ్ ముగియడంతో.. ఆన్‌లైన్ ద్వారా జడ్జి ఎదుట ప్రవేశ పెట్టారు. కాగా, ఆయన రిమాండ్‌ను రెండు రోజుల పాటు పొడిగిస్తున్నట్లు జడ్జి చెప్పారు. ఈ క్రమంలో కస్టడీపై కూడా తీర్పు చెప్పింది. రెండు రోజలు పాటు రాజమండ్రిలోనే ఆయన్ను విచారించాలని కోర్టు చెప్పింది.
రాజమండ్రి నుంచి విజయవాడకు వీఐపీ ఖైదీని తరలించడం కష్టం కావడం. బయట ఉన్న పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబుకు అత్యంత భద్రత ముఖ్యం కావడంతో.. విచారణ ఎక్కడ చేస్తారని సీఐడీ తరపు లాయర్లను కోర్టు ప్రశ్నించింది. అయితే, రాజమండ్రి సెంట్రల్ జైలులోనే చంద్రబాబును విచారిస్తామని సీఐడీ లాయర్లు స్పష్టం చేశారు.
ఇద్దరు లాయర్ల సమక్షంలో చంద్రబాబును విచారించాలని.. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల మధ్యే విచారణ చేయాలని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది.
♦