ఝండూబామ్ రాసి కొట్టారు.. ఖండించిన సీఐడీ
పోలీసులు ఏమైనా ఇబ్బంది పెట్టారా అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. తనను రాత్రంతా చిత్రహింసలకు గురిచేశారని వివరించారు. అర్ధరాత్రి సమయంలో మఫ్టీలో ఉన్న ఐదుగురు వ్యక్తులు వచ్చారని.. అప్పటి నుంచి తెల్లవారుజామున ఐదున్నర వరకు కొట్టారని వెల్లడించారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా కో-ఆర్డినేటర్‌గా ఉన్న దారపునేని నరేంద్రకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బుధవారం రాత్రి నరేంద్రను అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు.. గురువారం సాయంత్రం కోర్టు వద్దకు తీసుకొచ్చారు. అప్పటికే కోర్టు సమయం ముగియడంతో న్యాయమూర్తి నివాసం వద్ద అతడిని హాజరు పరిచారు.
పోలీసులు ఏమైనా ఇబ్బంది పెట్టారా అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. తనను రాత్రంతా చిత్రహింసలకు గురిచేశారని వివరించారు. అర్ధరాత్రి సమయంలో మఫ్టీలో ఉన్న ఐదుగురు వ్యక్తులు వచ్చారని.. అప్పటి నుంచి తెల్లవారుజామున ఐదున్నర వరకు కొట్టారని వెల్లడించారు. గుంజీలు తీయించారని, రెండు కాళ్లు సాగదీసి లాఠీలతో మోదారని, ఝండూబామ్ రాసి మరీ కొట్టారని నరేంద్ర వివరించారు.
దాంతో న్యాయమూర్తి.. నిందితుడిని జీజీహెచ్‌కు తరలించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆధీనంలో లేని ఆస్పత్రిలో తనకు పరీక్షలు చేయించాలని నరేంద్ర కోరగా.. తొలుత జీజీహెచ్ రిపోర్టు చూసి ఆ తర్వాత నిర్ణయం తీసుకుందామని న్యాయమూర్తి చెప్పారు. దాంతో రాత్రి 10.30 గంటల సమయంలో జీజీహెచ్‌కు తరలించి వైద్య పరీక్షలు చేయించారు.
తెల్లవారుజామున రెండు గంటల సమయంలో జీజీహెచ్ వైద్యుల నివేదిక అందింది. దాన్ని పరిశీలించిన న్యాయమూర్తి.. నిందితుడు నరేంద్రకు బెయిల్ మంజూరు చేశారు. సీఐడీ పోలీసుల రిమాండ్ రిపోర్టును న్యాయమూర్తి తిరస్కరించారు. దాంతో నరేంద్ర విడుదలయ్యారు.
అయితే తనను కొట్టారని నరేంద్ర చేసిన ఆరోపణలను ఖండిస్తూ సీఐడీ ఒక ప్రకటన విడుదల చేసింది. అరెస్ట్ చేసిన ప్రతీసారి సీఐడీ పోలీసులు కొట్టారని ఆరోపించడం సరికాదని సీఐడీ సూచించింది. సీఐడీ ఎప్పుడూ కూడా కొట్టడం లాంటి పనులు చేయదని వివరణ ఇచ్చింది.
గన్నవరం ఎయిర్‌పోర్టులో పట్టుబడిన బంగారం వ్యవహారంలో సంబంధం లేకున్నా సీఎంవోపై బురదజల్లే ప్రయత్నం చేశారని.. చట్టప్రకారమే నరేంద్రను అరెస్ట్ చేశామని వివరించింది. నరేంద్ర తన సెల్‌ఫోన్ ద్వారానే వివిధ గ్రూపుల్లోకి పోస్టులను షేర్ చేశారని సీఐడీ వెల్లడించింది.