గర్భిణిపై అత్యాచారం ఘటనలో న్యాయస్థానం సంచలన తీర్పు
ముగ్గురు వ్యక్తులు వారి వద్దకు వచ్చి భర్తను నిర్బంధించి అతని నుంచి రూ.750 నగదు లాక్కున్నారు. అతని భార్యను ప్లాట్‌ఫారం చివరి వరకు ఈడ్చుకెళ్లారు. భర్త కళ్లెదుటే ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు.
భర్త కళ్లెదుటే గర్భిణిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం బుధవారం సంచలన తీర్పు ప్రకటించింది. ముగ్గురు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడగా వారిలో ఒకరు మైనర్. ఈ నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులకు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ గుంటూరు జిల్లా నాలుగో అదనపు సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. ఏ-3గా ఉన్న మైనర్‌పై కేసు విచారణ తెనాలి పోక్సో కోర్టులో కొనసాగుతోంది.
2022 మే 1వ తేదీన రేపల్లె రైల్వేస్టేషన్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. బాధితుల స్వస్థలం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం. కృష్ణాజిల్లా నాగాయలంకలో ఉపాధి పనుల నిమిత్తం వారు తమ ముగ్గురు పిల్లలతో కలసి గుంటూరు, తెనాలి మీదుగా రాత్రి 11.30 గంటల సమయానికి రేపల్లె రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో నాగాయలంక వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో రైల్వేస్టేషన్‌లో నిద్రించారు.
అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మద్యం మత్తులో ఉన్న ముగ్గురు వ్యక్తులు వారి వద్దకు వచ్చి భర్తను నిర్బంధించి అతని నుంచి రూ.750 నగదు లాక్కున్నారు. అతని భార్యను ప్లాట్‌ఫారం చివరి వరకు ఈడ్చుకెళ్లారు. భర్త కళ్లెదుటే ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు. ఈ క్రమంలో బాధితుడు రైల్వే పోలీస్‌స్టేషన్ వద్దకు వెళ్లి ఎంతగా అరిచినా ఎవరూ స్పందించలేదు. దీంతో అతను బయటికి వెళ్లి స్థానికులను సహాయం కోరినా ఎవరూ రాలేదు. దీంతో అతను స్థానికంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి మొర పెట్టుకున్నాడు. వెంటనే వారు స్పందించి ఘటనాస్థలికి చేరుకునేసరికి అప్పటికీ ఒక నిందితుడు అత్యాచారానికి పాల్పడుతున్నాడు. పోలీసులు నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
నిందితుల్లో రేపల్లె నేతాజీనగర్‌కు చెందిన పాలుబోయిన విజయకృష్ణ (20), పాలుదురి నిఖిల్ (25), మరో మైనర్ ఉన్నారు. మైనర్ బాలుడు గతంలో పలు దొంగతనం కేసుల్లో నిందితుడు. నిందితులపై నేరం రుజువు కావడంతో ఏ-1, ఏ-2లకు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది.