కరకట్ట ఇల్లు అటాచ్ - లింగమనేని పిటీషన్ డిస్మిస్
లింగమనేని నివాసాన్ని అటాచ్ చేసేందుకు అవసరమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా..? లేదా..? అన్నదానిపై తాము దర్యాప్తు అధికారిని విచారించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట ఇంటి విషయంలో ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సీఐడీ అటాచ్‌ను రద్దు చేయాలంటూ లింగమనేని రమేష్ దాఖలు చేసిన పిటీషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. అటాచ్ మెంట్ ను రద్దు చేయాల్సిందిగా కోరే హక్కు లింగమనేని రమేష్ కు లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో లింగమనేని రమేష్ వాదనలు వినాల్సిన అవసరం కూడా లేదని విజయవాడ ఏసీబీ కోర్టు తేల్చి చెప్పింది.
అదే సమయంలో అటాచ్‌మెంట్ పై ఇప్పటికిప్పుడు ఉత్తర్వులు ఇవ్వలేమని కూడా చెప్పింది. లింగమనేని నివాసాన్ని అటాచ్ చేసేందుకు అవసరమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా..? లేదా..? అన్నదానిపై తాము దర్యాప్తు అధికారిని విచారించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
అటాచ్ మెంట్ వ్యవహారాన్ని విచారించే అధికారం, పరిధి ఏసీబీ కోర్టుకు ఉందని కూడా న్యాయస్థానం స్పష్టత ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారు అన్న ఆరోపణలపై లింగమనేని భవనాన్ని సీఐడీ అటాచ్ చేసేందుకు ఇదివరకే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కోర్టు అందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది.