Telugu Global
Andhra Pradesh

ఎన్టీఆర్ చైత‌న్య ర‌థం త‌ర‌హాలో ప‌వ‌న్ ప్ర‌చార ర‌థం!

నాడు తెలుగు రాజ‌కీయాల్లో మ‌లుపు తిప్పిన తెలుగుదేశం అధ్య‌క్షుడు ఎన్టీఆర్ చైత‌న్య ర‌థం త‌ర‌హాలోనే జ‌న‌సేన వాహ‌నం కూడా రూపొందుతోంద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ ర‌థంలో బ‌స‌చేసేందుకు వీలుగా అన్ని హంగులు, సౌక‌ర్యాలు ఉండేలా తయారు చేయిస్తున్నారు.

Pawan Kalyan Chaitanya Ratham
X

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో మ‌రో ప్ర‌చార ర‌థం సిద్ధ‌మ‌వుతోంది. ఎన్నిక‌ల నాటికి ప్ర‌జ‌ల్లో బ‌లంగా త‌న గ‌ళాన్ని వినిపించేందుకు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కూ ప్ర‌జ‌ల్లోనే ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇందుకోసం ఆయ‌న ప్ర‌త్యేకంగా ఓ ప్ర‌చార ర‌థాన్ని త‌యారు చేయించుకుంటున్నారు.

నాడు తెలుగు రాజ‌కీయాల్లో మ‌లుపు తిప్పిన తెలుగుదేశం అధ్య‌క్షుడు ఎన్టీఆర్ చైత‌న్య ర‌థం త‌ర‌హాలోనే జ‌న‌సేన వాహ‌నం కూడా రూపొందుతోంద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ ర‌థంలో బ‌స‌చేసేందుకు వీలుగా అన్ని హంగులు, సౌక‌ర్యాలు ఉండేలా తయారు చేయిస్తున్నారు. పుణెలో ఈ ర‌థాన్ని త‌యారుచేయంచాల‌ని అనుకున్నా ప‌వ‌న్ సూచ‌న‌ల‌కు అందుబాటులో ఉండేలా ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోనే దీనికి రూప‌క‌ల్ప‌న జ‌రుగ‌తోందంటున్నారు.

ఈ ర‌థంపై నుంచే ఆయ‌న ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ర‌థం ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేలా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఇందుకు అనువుగా మిలిట‌రీ గ్రీన్ రంగును వాహ‌నానికి వేయిస్తున్నారు. ఎటువంటి ఆడంబ‌రం లేకుండా ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌కు వెళ్ళేందుకు వారిని ఆక‌ట్టుకునేలా ప‌వ‌న్ ప్ర‌చారం సాగనుంద‌ని అంటున్నారు. నాడు ఎన్టీఆర్ రాష్ట్ర‌వ్యాప్తంగా ప‌ర్య‌టించి ప్రచారం చేసిన త‌ర‌హాలోనే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా త‌న ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని త‌యారు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ త‌న ప్ర‌చార ర‌థానికి కూడా మిలిట‌రీ గ్రీన్ రంగునే ఉప‌యోగించారు. ప‌వ‌న్ కూడా నేడు అదే రంగును వేయిచ‌డంతో ఆయ‌న ఎన్టీఆర్ వ్యూహాన్ని అనుస‌రిస్తున్నారా అనే సందేహాలు క‌లుగుతున్నాయి. మ‌రి ఎన్టీఆర్ సృష్టించిన త‌ర‌హాలో ప్ర‌భంజ‌నం రానుందా అనేది వేచి చూడాలి.

అయితే ఆ నాడు ఎన్టీర్ ఖాకీ డ్ర‌స్ లో త‌న ప్ర‌చార ర‌థంపై విస్తృతంగా ప్ర‌చారం చేశారు. మ‌రి ప‌వ‌న్ క‌ల్యాణ్ డ్ర‌స్ విష‌యంలో కూడా ఆయ‌న్నే అనుస‌రిస్తారా లేదా త‌న‌దైన రీతిలో మ‌రేదైనా ఎంపిక చేసుకుంటారా అనేది చూడాలి.

First Published:  25 Nov 2022 11:13 AM IST
Next Story