Telugu Global
Andhra Pradesh

విజయమ్మ, సుబ్బారెడ్డి గత వ్యాఖ్యలతో టీడీపీ ఎదురుదాడి

పాదయాత్ర అన్నాక అప్పటికప్పుడు ఎంతోమంది వస్తూ ఉంటారని, సుదీర్ఘ పాదయాత్ర కావడంతో వాహనాలను కూడా మార్చాల్సి రావచ్చని, ఆ వివరాలను ఇప్పుడే ఇవ్వాలంటే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు.

విజయమ్మ, సుబ్బారెడ్డి గత వ్యాఖ్యలతో టీడీపీ ఎదురుదాడి
X

టీడీపీ నేత లోకేష్ పాదయాత్రకు మంచి ప్రచారాన్ని తీసుకొచ్చే పనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది . ఈనెల 27 నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభిస్తున్న నేపథ్యంలో అనుమతుల విషయంలో ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి మధ్య వివాదం నడుస్తోంది. పాదయాత్రలో ఎవరెవరు పాల్గొంటారు..? ఎన్ని వాహనాలు ఉంటాయి, వాటి నంబర్లు ఏంటి..? వంటి వివరాలు ఇవ్వాలంటూ డీజీపీ కోరడంపై తెలుగుదేశం పార్టీ ఆగ్రహంగా ఉంది.

చాలా రోజుల క్రితమే అనుమతి కోసం దరఖాస్తు చేసినప్పటికీ ఆలస్యంగా డీజీపీ స్పందించారని, పాదయాత్రకు కేవలం ఆరు రోజుల సమయం ఉండగా స్పందించిన డీజీపీ.. ఇప్పుడు అనవసరమైన వివరాలు అడుగుతూ ఇబ్బందులు పెడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. 400 రోజులపాటు జరిగే పాదయాత్రలో ఎవరెవరు పాల్గొంటారు..? ఏ ఏ వాహనాలు ఉంటాయి..? వాటి నంబర్లు వంటివన్నీ ఇప్పుడే ఇవ్వడం ఎలా సాధ్యమవుతుందని తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తోంది.

పాదయాత్ర అన్నాక అప్పటికప్పుడు ఎంతోమంది వస్తూ ఉంటారని, సుదీర్ఘ పాదయాత్ర కావడంతో వాహనాలను కూడా మార్చాల్సి రావచ్చని, ఆ వివరాలను ఇప్పుడే ఇవ్వాలంటే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఈ దేశంలో ఏ పోలీస్ అధికారి కూడా ఇలాంటి వివరాలు అడిగి ఉండరని.. అసలు తెలుగుదేశం పార్టీకి రాసిన లేఖ డీజీపీ నుంచి వచ్చిందా..? సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి వచ్చిందా..? అని వర్ల రామయ్య ప్రశ్నించారు.

పాదయాత్రలో పాల్గొనే వారి ఆధార్ కార్డులు కూడా ఇవ్వాలని అడుగుతున్నారంటే దీన్ని ఏమనాలని రామయ్య ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో నాడు వైవీ సుబ్బారెడ్డి అసలు పాదయాత్రకు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పిన విషయాన్ని టీడీపీ గుర్తుచేస్తోంది. పోలీసు ఉన్నతాధికారి ఒకరు జగన్ పాదయాత్ర సమయంలో సుబ్బారెడ్డికి ఫోన్ చేసి యాత్రకు అనుమతులు తీసుకున్నారా? అని ప్రశ్నించగా.. పాదయాత్రకు అనుమతులు తీసుకునే ప్రశ్నే ఉత్పన్నం కాదని, పోలీసులు ఎంత ఒత్తిడి చేసినా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం తమకు లేదని వైవీ సుబ్బారెడ్డి చెప్పడం, ఆ అంశాన్ని వైసీపీ మీడియాలోని ప్రచురించిన ఉదంతాన్ని టీడీపీ ప్రస్తావిస్తోంది.

షర్మిల పాదయాత్ర సమయంలోనూ ఎలాంటి అనుమతులు తీసుకోలేదని టీడీపీ చెబుతోంది. తెలంగాణలో వైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత తలెత్తడంతో పోలీసులు అభ్యంతరాలు లేవనెత్తిన సమయంలో ఆమె తల్లి వైఎస్ విజయమ్మ చేసిన వ్యాఖ్యలను టీడీపీ ప్రచారం చేస్తోంది. పాదయాత్ర ని అడ్డుకునే ప్రభుత్వాలను ఇప్పటివరకు తాను చూడలేదని, దేశంలో కూడా ఎక్కడ జరిగి ఉండదని విజయమ్మ నాడు వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు చేసే కార్యక్రమాలను ప్రభుత్వాలు గౌరవించాలని, అలా చేసినప్పుడే సదరు ప్రభుత్వాలు మంచి ప్రభుత్వాలుగా మన్ననలు పొందుతాయంటూ విజయమ్మ హితబోధ చేసిన వీడియోను టీడీపీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

నారా లోకేష్ పాదయాత్రకు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడం ఒక విధంగా అధికార పార్టీ తప్పిదమే అనిపిస్తోంది. పాదయాత్రకు అనుమతి ఇవ్వకా తప్పదు.. ఒకవేళ ఇవ్వకపోతే కోర్టు ద్వారా నైనా అనుమతులు రాకుండా ఉండవు. అలాంటప్పుడు లోకేష్ పాదయాత్రకు ప్రచారం కల్పించే తరహాలో ప్రభుత్వం, పోలీసుల వ్యవహారం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

First Published:  23 Jan 2023 9:23 AM IST
Next Story