ఆ జిల్లా జర్నలిస్టులు కొమ్మినేని పేరుతో కుమ్మారట!
ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీకాకుళం టూరు కోసం అంటూ వివిధ ప్రభుత్వశాఖల నుంచి లక్షల్లో వసూళ్లు చేసిన జర్నలిస్టులంతా కొమ్మినేని పర్యటన ఆసాంతం ఆయనతోనే ఉన్నారని, ఈ దందా ఆయనకి తెలియకపోయి ఉండొచ్చని జర్నలిస్టులు అంటున్నారు.
తెలుగు రాష్ట్రాల రాజకీయాలను అవపోసన పట్టిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఎన్టీవీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాక్షిలో కూడా కీలక హోదాల్లో పనిచేశారు. కెరీర్‌లో రాజకీయ అభిప్రాయభేదాలు తప్పించి, ఇతర సీనియర్ జర్నలిస్టుల మాదిరిగా అవినీతి ఆరోపణలు పెద్దగా రాలేదు. ఇటీవలే ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా కొమ్మినేనిని నియమించారు. పదవిలోకి వచ్చాక పరిచయ కార్యక్రమంలా ఉంటుందని ప్రతీ జిల్లాకు అధికారిక పర్యటనలు ఆరంభించారు. తొలిసారిగా శ్రీకాకుళం జిల్లాతో తన టూరుని షురూ చేశారు కొమ్మినేని. ఏ ముహూర్తాన మొదలు పెట్టారో కానీ, ప్రతీ పర్యటనలో ఏదో ఒక వివాదం చుట్టుముడుతూనే ఉంది.
వాస్తవంగా ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా కొమ్మినేని శ్రీనివాసరావు పర్యటనలకు ప్రోటో కాల్ ఉంటుంది. వాహనాలు, పర్యటనలు, భోజనాలు అన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. శ్రీకాకుళం పర్యటనకు వెళ్లగా అక్కడ కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లూ చేశారు. అయితే కొందరు జర్నలిస్టులు కొమ్మినేని పేరు చెప్పి వసూళ్లకు దిగారని శ్రీకాకుళం జర్నలిస్టు సర్కిల్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీకాకుళం వస్తున్న సందర్భంగా ప్రతీ ప్రభుత్వశాఖ లక్షల్లో ఇవ్వాలని కొందరు జర్నలిస్టులు గ్రూపుగా ఏర్పడి దందా మొదలుపెట్టారని ఈ గ్రూపుతో సంబంధంలేని జర్నలిస్టులు ప్రచారం ఆరంభించారు. భోజనాలకి ఓ శాఖ, సన్మానాలకు మరో శాఖ, రవాణా-వాహనాల ఈ ఖర్చుల కోసమంటూ ప్రభుత్వ అధికారులకు టార్గెట్ పెట్టి మరీ వసూలు చేశారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీకాకుళం టూరు కోసం అంటూ వివిధ ప్రభుత్వశాఖల నుంచి లక్షల్లో వసూళ్లు చేసిన జర్నలిస్టులంతా కొమ్మినేని పర్యటన ఆసాంతం ఆయనతోనే ఉన్నారని, ఈ దందా ఆయనకి తెలియకపోయి ఉండొచ్చని జర్నలిస్టులు అంటున్నారు. కొమ్మినేని శ్రీకాకుళం పర్యటన జరిగి చాలా రోజులైనా ఇంకా ఈ వసూళ్ల చర్చ నడుస్తూనే ఉంది. కందుకూరు పర్యటనకి వెళ్లినప్పుడు ప్రెస్ అకాడమీ చైర్మన్, జర్నలిస్టుల మధ్య వాగ్వాదం జరిగింది. మొత్తానికి కొమ్మినేని జర్నలిస్టుగా జగడాలకి తోడు ప్రెస్ అకాడమీ చైర్మన్ వివాదాలు బాగానే ముదురుతున్నాయి.