కాకినాడ రూరల్ సీటు.. తమ్ముళ్లు వర్సెస్ జనసైనికులు
తాజాగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన ఆఫీస్ ప్రారంభించడంతో జనసేన, టీడీపీల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. నేతల మధ్య మాటల తూటాలతో పొలిటికల్ హీట్ పెరిగింది. అయితే అధికార పార్టీ వైసీపీపై పోరాడాల్సిన టీడీపీ, జనసేన సీట్ల కోసం ఒకదానిపై ఒకటి కత్తులు దూస్తున్నాయి. రెండు పార్టీల కార్యకర్తల మధ్య గ్రౌండ్‌లో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో బహిరంగంగానే రెండు పార్టీల కార్యకర్తలు తన్నుకున్నారు. తాజాగా కాకినాడ రూరల్ సీటు.. తెలుగుదేశం, జనసేన మధ్య చిచ్చు రాజేసింది.
తాజాగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన ఆఫీస్ ప్రారంభించడంతో జనసేన, టీడీపీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అయితే సీట్ల పంపిణీ జరగకుండానే పార్టీ ఆఫీసును ప్రారంభించడంపై స్థానిక టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. జనసేన వైఖరిని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త సత్యనారాయణ తప్పుపట్టారు. జనసేనకు టికెట్ ఇస్తే సహకరించేది లేదని గురువారం ప్రకటించారు. ఆ ప్రకటనపై తర్వాత క్షమాపణలు చెబుతూనే జనసేన తీరును తప్పుపట్టారు పిల్లి. జనసేనకు బీసీల ఓట్లు అవసరం లేదా..? అంటూ పిల్లి అనంతలక్ష్మి మండిపడ్డారు.
ప్రస్తుత పరిస్థితులు చూస్తే.. టీడీపీ, జనసేనల అభ్యర్థులను ఓడించేందుకు వైసీపీ అభ్యర్థులు అవసరం లేదని.. వాళ్లలో వాళ్లే ఒకరి అభ్యర్థిని మరొకరు ఓడించుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ ప్రచారాలను నిజం చేస్తూ చాలా నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన నేతలు పరస్పరం మాటల యుద్ధానికి దిగుతున్నారు. కొన్నిచోట్ల ఒకరిపై ఒకరు దాడులు కూడా చేసుకున్నారు. పిఠాపురంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. జనసేన ఇన్‌ఛార్జి తంగెళ్లపై ఇటీవల పరోక్షంగా కామెంట్స్ చేశారు వర్మ. లోకల్, నాన్ లోకల్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు.