రాయచోటి టీడీపీలో రచ్చ.. పార్టీ ఫ్లెక్సీలకు నిప్పు
రాయచోటి తెలుగుదేశం టికెట్ కోసం దాదాపు నలుగురు పోటీ పడుతున్నారు. వారిలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, నియోజకవర్గ ఇన్‌ఛార్జీగా ఉన్న ఆర్. రమేష్ కుమార్ రెడ్డి, ఇటీవలే టీడీపీలో చేరిన గడికోట ద్వారకానాథ్ రెడ్డి, సుగవాసి ప్రసాద్ బాబు ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలుగుదేశం పార్టీలో టికెట్ల వివాదం ముదురుతోంది. తాజాగా రాయచోటి తెలుగుదేశం పార్టీలో విబేధాలు భగ్గుమన్నాయి. తెలుగుదేశం పార్టీ టికెట్‌ను మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి కేటాయించారంటూ వార్తలు రావడంతో నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జిగా ఉన్న ఆర్.రమేష్ కుమార్ రెడ్డి వర్గీయులు భగ్గుమన్నారు.
రాంప్రసాద్ రెడ్డికి టికెట్ కేటాయించడాన్ని నిరసిస్తూ పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించారు రమేష్ కుమార్ రెడ్డి వర్గీయులు. ఇదే సీటు ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి సైతం రాంప్రసాద్ రెడ్డికి టికెట్ కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిరసనగా శుక్రవారం అర్ధరాత్రి లక్కిరెడ్డిపల్లి చౌరస్తాలో తెలుగుదేశం పార్టీ జెండాలను నిప్పు పెట్టారు. చంద్రబాబు పోస్టర్లను చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రాయచోటి తెలుగుదేశం టికెట్ కోసం దాదాపు నలుగురు పోటీ పడుతున్నారు. వారిలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, నియోజకవర్గ ఇన్‌ఛార్జీగా ఉన్న ఆర్. రమేష్ కుమార్ రెడ్డి, ఇటీవలే టీడీపీలో చేరిన గడికోట ద్వారకానాథ్ రెడ్డి, సుగవాసి ప్రసాద్ బాబు ఉన్నారు. అయితే చంద్రబాబు ఎవరికీ టికెట్ ఇస్తారనేది గందరగోళంగా మారింది.
ఇక రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చివరిసారిగా 2004లో గెలిచింది. అంటే దాదాపు 20 ఏళ్లయింది. 2009 నుంచి కాంగ్రెస్, వైసీపీల తరపున గడికోట శ్రీకాంత్ రెడ్డి గెలుస్తూ వస్తున్నారు. 2012 ఉపఎన్నికతో కలిపి ఆయన వరుసగా నాలుగు సార్లు విజయం సాధించారు.