నంద్యాల తెలుగుదేశం మూడు ముక్కలాట
నంద్యాల టికెట్ తనకే ఇవ్వాలంటూ ఏవీ సుబ్బారెడ్డి ఒత్తిడి తెస్తున్నారు. చంద్రబాబుకు ఆత్మీయుడు ఎన్ఎండీ ఫరూఖ్ కూడా టికెట్ తనకిస్తే పోటీ చేయడానికి రెడీ అంటున్నారు.
తెలుగుదేశం పార్టీకి నంద్యాల నియోజకవర్గం నాడి అంతుచిక్కడంలేదు. అధికారంలో ఉన్నప్పుడు కలిసివచ్చిన బలాలతో ఉపఎన్నిక మాత్రం నెగ్గగలిగింది. మళ్లీ 2019లో దారుణ పరాజయం పాలైంది. అప్పటి నుంచి నంద్యాల సీటు కోసం పోటీపడే వారి సంఖ్య పెరుగుతోంది కానీ, పార్టీ బలోపేతం కావడంలేదని టీడీపీ అధిష్టానం ఆందోళనలో ఉంది. అయితే నంద్యాలలో మాత్రం అధికార వైసీపీలో శిల్పావర్గం మాత్రమే ఉంది. టీడీపీలో మాత్రం మూడువర్గాలు, ఆరు గ్రూపులుగా విడిపోయారు.
టీడీపీ నంద్యాల ఇన్‌చార్జి భూమా బ్రహ్మానందరెడ్డికి పార్టీ నేతలు ఎవరితోనూ పొసగడంలేదు. భూమా కుటుంబంతోనూ సంబంధాలు తెగిపోయినట్టేనంటున్నారు. ఇంకోవైపు పిల్లనిచ్చిన మామ బనగానపల్లె వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అక్రమాలపై తెలుగుదేశం పార్టీ ఉద్యమిస్తోంది. వైసీపీపై పోరాడుతున్న టీడీపీతో కలిసి నడవలేని దుస్థితి భూమా బ్రహ్మానందరెడ్డిది.
నంద్యాల టికెట్ తనకే ఇవ్వాలంటూ ఏవీ సుబ్బారెడ్డి ఒత్తిడి తెస్తున్నారు. చంద్రబాబుకు ఆత్మీయుడు ఎన్ఎండీ ఫరూఖ్ కూడా టికెట్ తనకిస్తే పోటీ చేయడానికి రెడీ అంటున్నారు. వీరి మధ్య తన సీటుకి ఎసరు వస్తుందనే అభద్రతాభావంలో బ్రహ్మానందరెడ్డి అందరినీ అనుమానిస్తూ దూరం చేసుకుంటున్నారు.
పూర్తిస్థాయి నివేదికలు పరిశీలించిన అనంతరం ఫరూఖ్, ఏవీ సుబ్బారెడ్డితో కలిసి పనిచేయాలని భూమా బ్రహ్మానందరెడ్డికి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. విభేదాలు పక్కనపెట్టి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని స్పష్టంగా చెప్పారు. ముగ్గురూ కలిసి పనిచేసినప్పుడే ముగ్గురి పనితీరు, సామాజిక సమీకరణాలు చూసి అభ్యర్థి ఎవరనేది త్వరలోనే ఖరారు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టి ఐక్యంగా ఉండాలని భూమా, ఏవీ సుబ్బారెడ్డి వర్గాలకు గట్టిగానే హెచ్చరిక జారీ చేశారు.
ముగ్గురి సీటు పోరు అసలుకే ఎసరు తెచ్చిందని బ్రహ్మానందరెడ్డి ఆందోళనలో ఉన్నారు. తననే నియోజకవర్గ ఇన్‌చార్జిగా ప్రకటిస్తారని ఎవరికి వారు ఎంతో ఆశతో వస్తే, గ్రూపు గొడవల నెపంతో ఏకంగా పెండింగ్‌లో పెట్టేయడంతో నంద్యాల తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు నేతల అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.