రెడ్డి - కాపుల మధ్య కయ్యానికేనా 'రెక్కీ' గొడవలు
ఈ గొడవంతా రాజమండ్రిలో వైసీపీలోని కాపు ప్రజాప్రతినిధుల మీటింగ్ తర్వాతే మొదలైంది. ఇదంతా చూసిన తర్వాత రెడ్డి - కాపు సామాజిక వర్గాల మధ్య వివాదాన్ని రేకెత్తించే కుట్రేమన్నా జరుగుతోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
రాజకీయాల్లో ఏ చిన్న అవకాశం దొరికినా మ్యాగ్జిమమ్ ఉపయోగించుకోవాలని చూసేవాళ్ళు చాలామందే ఉంటారు. అయితే ఒక్కోసారి అలాంటి ప్రయత్నాలు బూమరాంగ్ కూడా అవుతుంటాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఇపుడు హాట్ టాపిక్‌గా మారిన రెక్కీ ఘటన అలాంటిదే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను హత్య చేసేందుకు కుట్రలు జరుగుతున్నట్లు మూడు రోజులుగా గోలగోల అయిపోతోంది. దీనికి ఆధారం ఏమిటంటే పవన్ ఇంటి ముందు ముగ్గురు యువకులు అనుమానాస్పదంగా కనిపించటమే కాకుండా గొడవ కూడా పెట్టుకున్నారట.
ఈ గోలను మొదట జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ మొదలుపెట్టారు. ఆయన ఆరోపణలను జగన్మోహన్ రెడ్డి మీదే ఎక్కుపెట్టారు. దాన్ని వెంటనే చంద్రబాబు నాయుడు, సోమువీర్రాజు, ఎల్లో మీడియా అందిపుచ్చుకున్నాయి. హత్య చేయటం కోసమే పవన్ ఇంటి ముందు రెక్కీ జరిగిందని నిర్ధారించేసి జగన్ పై బురదచల్లేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే పవన్ ఇంటికి దగ్గరలోనే ఉన్న పబ్‌లో మందు తాగేసి ముగ్గురు యువకులు కారును పవన్ ఇంటి ముందు ఆపేశారు. కారును తీయమని సెక్యూరిటి సిబ్బంది చెప్పినప్పుడు మాటమాట పెరిగి గొడవైంది.
దాన్నే పవన్ ఇంటి ముందు రెక్కీ అంటు కంపు చేసేశారు. పవన్ ఇంటి ముందు ఆపిన కారు రెడ్డి కార్పొరేషన్ ఛైర్మన్ సత్యనారాయణరెడ్డిదంటూ ఎల్లోమీడియా తమ చానళ్ళల్లో ప్రసారం చేశాయట. దాంతో సదరు ఛైర్మన్ ఎల్లో మీడియాపై మండిపోతున్నారు. యువకులు వాడిన కారుకు గుజరాత్ రిజిస్ట్రేషన్ కనబడుతోంది. ఛైర్మన్ కారేమో ఇంట్లోనే ఉంది. అంటే యువకుల కారుకు ఛైర్మన్ కారు నెంబర్ ప్లేట్‌ను మార్ఫింగ్ చేసి ఎల్లో మీడియా ప్రసారం చేశాయనేది ఆరోపణ. తీరా చూస్తే న్యూసెన్స్ గొడవను రెక్కీగా మార్చేశారని పోలీసుల దర్యాప్తులో తేలిపోయింది.
ఇదంతా చూసిన తర్వాత రెడ్డి - కాపు సామాజిక వర్గాల మధ్య వివాదాన్ని రేకెత్తించే కుట్రేమన్నా జరుగుతోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కమ్మ, కాపు, రెడ్డి కార్పొరేషన్ల ఛైర్మన్లు అడపా శేషు, తుమ్మల చంద్రశేఖర్, సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ రెడ్లు - కాపుల మధ్య గొడవలు పెట్టడానికి చంద్రబాబు, పవన్, ఎల్లోమీడియా కుట్రలు చేస్తున్నట్లు మండిపోయారు. ఈ గొడవంతా రాజమండ్రిలో వైసీపీలోని కాపు ప్రజాప్రతినిధుల మీటింగ్ తర్వాతే మొదలైంది. వీళ్ళ ఆరోపణలపై లోతుగా ఆలోచించాల్సిందే.