కాంగ్రెస్‌ది డర్టీ గేమ్.. మా పోటీ వాళ్లతోనే - జగన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఏపీ రాజకీయాల్లో షర్మిల ఎంట్రీ, కాంగ్రెస్ పాలిటిక్స్‌పైనా స్పందించారు జగన్. ఏపీలో కాంగ్రెస్ చెత్త రాజకీయం చేస్తోందన్నారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు ఏపీ సీఎం జగన్. తన వల్ల మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయమని ధైర్యంగా ప్రజలను అడుగుతున్నానన్నారు. తిరుపతిలో జరిగిన ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు అమలు చేశామన్నారు.
ఏపీ రాజకీయాల్లో షర్మిల ఎంట్రీ, కాంగ్రెస్ పాలిటిక్స్‌పైనా స్పందించారు జగన్. ఏపీలో కాంగ్రెస్ చెత్త రాజకీయం చేస్తోందన్నారు. కాంగ్రెస్ నుంచి తను బయటకు వచ్చిన టైమ్‌లో తన సొంత బాబాయిని మంత్రిగా చేసి తమకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోటీ చేయించిందన్నారు. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోని కాంగ్రెస్ ఇవాళ తన సోదరిని ప్రయోగిస్తోందన్నారు. దేవుడు తప్పకుండా కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్తాడన్నారు జగన్. ఏపీలో జాతీయ పార్టీలకు అంతగా బలం లేదన్న జగన్.. టీడీపీ-జనసేన కూటమితోనే వైసీపీ పోటీ అన్నారు. అంశాల వారీగానే బీజేపీకి మద్దతిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుపైనా క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు అవినీతి చేశారు కాబట్టే అరెస్టయ్యారని చెప్పారు. ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతను అరెస్టు చేయాలని ఎవరు అనుకోరన్నారు జగన్. చంద్రబాబు అంశం ప్రస్తుతం కోర్టుల పరిధిలో ఉందన్నారు. పోలీసులు కోర్టుకు అన్ని సాక్ష్యాధారాలు అందించారన్నారు. సీఐడీని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు అర్థరహితమన్నారు.