గుడివాడలో టీడీపీ డైలమా.. కొడాలి నాని ధీమా
గుడివాడ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా రావి వెంకటేశ్వరరావు ఉన్నారు. టీడీపీ కార్యక్రమాలన్నీ రావి చేపడుతున్నా, కొడాలి నానిని ఢీకొట్టే ఆర్థిక స్థోమత లేదని పార్టీలో అంతర్గత చర్చ సాగుతోందని సమాచారం.
తెలుగుదేశం పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి ఎలా చెక్ పెట్టాలో తెలియక టీడీపీ వ్యూహకర్తలు సతమతమవుతున్నారు. గుడివాడలో కొడాలి కొమ్ములు విరిచే నాయకుడి కోసం టీడీపీ ఇంకా వెతుకుతూనే ఉంది. తాజాగా గుడివాడ టీడీపీకి మూడో కృష్ణుడుని రంగంలోకి దింపారు.
ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము టీడీపీ నుంచి గుడివాడ టికెట్ ఆశిస్తున్నారు. అధినేత ఆశీస్సులు తనకి ఉన్నాయంటోన్న వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం చేపట్టారు. ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకుంటూ నియోజకవర్గంలో అల్లుకుపోతున్నారు. మరోవైపు తన ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, రజకులకు ఇస్త్రీ బండ్లు అందజేస్తున్నారు.
గుడివాడ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా రావి వెంకటేశ్వరరావు ఉన్నారు. టీడీపీ కార్యక్రమాలన్నీ రావి చేపడుతున్నా, కొడాలి నానిని ఢీకొట్టే ఆర్థిక స్థోమత లేదని పార్టీలో అంతర్గత చర్చ సాగుతోందని సమాచారం. మరోవైపు కొడాలి నానితో లాలూచీ కూడా రావికి ఉందనే అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థికంగా బలంగా ఉన్న ఎన్‌ఆర్ఐ వెనిగండ్ల రాముపై పార్టీ దృష్టి సారించింది. రాము క్యాస్ట్ ఈక్వేషన్ కూడా టీడీపీ సీటుకి రూటు క్లియర్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. రాము కమ్మ సామాజికవర్గం కాగా, ఆయన భార్య దళిత్-క్రిస్టియన్ కావడంతో అటువైపు టీడీపీ మొగ్గు చూపుతోంది. గుడివాడ నియోజకవర్గంలో కమ్మ ఓటర్లు గణనీయంగా, ఎస్సీ ఓటర్లు అధికసంఖ్యలో ఉన్నారు. ఈ రెండు కులాల కాంబినేషన్ రాములో ఉండటం ప్లస్ అవుతుందని ఆలోచిస్తున్నారని సమాచారం.
గుడివాడ నియోజకవర్గం నుంచి కొడాలి నాని 4 సార్లు గెలిచారు. మొదటి రెండుసార్లు టీడీపీ అభ్యర్థి, చివరి రెండుసార్లు వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. గత ఎన్నికల్లో నానిపై టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన దేవినేని అవినాష్ వైసీపీలో చేరిపోయారు. దీంతో 2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి కొడాలి నాని చేతిలో ఓడిపోయిన రావి వెంకటేశ్వరరావుని టీడీపీ ఇన్‌చార్జిగా ఉంచినా, నానిని ఓడించే సత్తా లేదని అధిష్టానం అయోమయంలో పడింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుటుంబాన్ని అసభ్యంగా దూషించే కొడాలి నాని ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదనేది టీడీపీ వ్యూహం. ఈ ప్లాన్ ప్రకారం కులసమీకరణాలు, ఆర్థిక అండదండలు, జనంలో పలుకుబడి అన్నీ కలిసే అభ్యర్థులని వెతికే పనిలో ఉంది. చాలా రోజులుగా చాలామందిని పరిశీలించి ఎవరినీ ఎంపిక చేయలేని డైలమాలో ఉంది. ఇదే కొడాలి నానికి మరింత బలంగా మారిందని, గెలుపుపై ధీమా ఏర్పడిందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.