కమలంతో ప్రయాణంపై తెలుగుదేశంలో గుబులు
టీడీపీ జనసేనతో కలిసి ఉంటే, జనసేన బీజేపీతో అంటకాగుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే వ్యూహంలో మూడు పార్టీలు కలిస్తే మైనారిటీలు టీడీపీకి దూరమయ్యే ప్రమాదం ఉందని విశ్లేషణలు వస్తున్నాయి.
ఢిల్లీలో ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం ఏపీలో ప్రకంపనలు రేపుతోంది. ఒక్క ఎమ్మెల్యే గెలిచి వైసీపీలో చేరిన జనసేన మాత్రమే ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశానికి వెళ్లింది. ఏపీలో అధికార విపక్షాలకి ఎన్డీఏ నుంచి ఆహ్వానమూ లేదు. ఇటు నుంచి స్పందనా లేదు. కానీ, హస్తినలో ఎన్డీఏ భేటీ ఏపీలో పొలిటికల్ హీట్ పెంచేస్తోంది. జనసేన అధ్యక్షుడు తాను ఎన్డీఏలో ఉన్నానని, తనతో టీడీపీ ఉందని.. వీరిద్దరికీ మధ్య అవగాహన సమస్య ఉందని పొంతనలేని ప్రకటనలు గందరగోళానికి తెరతీశాయి.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని, బీజేపీ-టీడీపీ-జనసేన కలిసి పోటీచేసే అవకాశం ఉందని కూడా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. పవన్ ప్రకటనపై టీడీపీ పెద్దల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో టీడీపీ అభిమానుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. జనసేన కోసమో, కేంద్ర ప్రభుత్వ ప్రాపకం కోసమో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అధికారం దక్కించుకోవడం కోసమో బీజేపీతో జట్టుకడితే టీడీపీ చాలా దారుణంగా దెబ్బతింటుందని అభిమానులు ఆందోళనలో ఉన్నారు.
2014లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. ఓటు బ్యాంకే లేని బీజేపీకి కొన్ని సీట్లు ఇచ్చి గెలిపించుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి టీడీపీకి నాడు నెలకొంది. టీడీపీ బలంతో గెలిచిన ఆ బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీడీపీ సర్కార్‌కి పక్కలో బల్లెంలా తయారయ్యారు. అనంతరకాలంలో ప్రత్యేక హోదా డిమాండ్‌తో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకొచ్చింది. ఇప్పుడు ఎన్నికల ప్రయోజనాల కోసం ఎన్డీఏలో చేరితే ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎలా చేరారు అనే దానిపై సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
టీడీపీ జనసేనతో కలిసి ఉంటే, జనసేన బీజేపీతో అంటకాగుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే వ్యూహంలో మూడు పార్టీలు కలిస్తే మైనారిటీలు టీడీపీకి దూరమయ్యే ప్రమాదం ఉందని విశ్లేషణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముస్లిం మతపెద్దలతో టీడీపీ అధినేత మంతనాలు జరిపారు. మతపరమైన విశ్వాసాలకు అండగా ఉంటామని అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారని శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ ప్రకటించడం బీజేపీ, టీడీపీ పొత్తుపై మైనారిటీల ఆందోళనని స్పష్టం చేస్తోంది. సోషల్ మీడియాలోనూ బీజేపీతో పొత్తుని టీడీపీ ఇంటలెక్చువల్స్, ఫ్యాన్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఓ వైపు జనసేనాని టీడీపీ- బీజేపీ పొత్తు ఖాయం చేయాలని చర్చలు జరుపుతుండగా, ఆ పొత్తు టీడీపీ పాలిట మరణశాసనమని ఆ పార్టీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాలలో తమ అభిప్రాయాలను పోస్ట్ చేస్తున్నారు.