Telugu Global
Andhra Pradesh

ఉండవల్లికి ఇప్పటికి మద్దతు దొరికిందా?

మార్గదర్శి, రామోజీకి వ్యతిరేకంగా స్వర్ణాంధ్ర వేదిక పేరుతో విజయవాడలో ఆదివారం సమావేశం జరిగింది. ఈ సదస్సులో ఉండవల్లితో పాటు సీనియర్ జర్నలిస్టు కేజీబీ తిలక్, హైకోర్టు సీనియర్ లాయర్ ఎస్. సత్యనారాయణ ప్రసాద్ లాంటి వాళ్ళు పాల్గొన్నారు.

ఉండవల్లికి ఇప్పటికి మద్దతు దొరికిందా?
X

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌కు ఇంతకాలానికి మద్దతు దొరికింది. మార్గదర్శి చిట్స్ ఫండ్స్ మోసాలకు సంబంధించి చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజపై సీఐడీ చీటింగ్ కేసులు నమోదు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడైతే మార్గదర్శి మీద దాడులు పెరిగి రామోజీ, శైలజ మీద కేసులు నమోదయ్యాయో అప్పటి నుండి ఉండవల్లి మీద ఎల్లో మీడియాలో వ్యతిరేక వార్తలు పెరిగిపోయాయి. రామోజీ, శైలజ విచారణ తర్వాత మార్గదర్శికి మద్దతుగా ఉండవల్లికి వ్యతిరేకంగా అనేక సమావేశాలు జరుగుతున్నాయి.

జరిగిన సమావేశాలన్నీ రామోజీ ప్రోద్బలంతోనే జరుగుతున్నట్లు అర్థ‌మైపోతోంది. అంటే మార్గదర్శి విషయంలో ఉండవల్లి ఒకవైపు రామోజీ సమర్థ‌కులంతా మరోవైపు నిలబడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం విజయవాడలో మొదటిసారిగా మార్గదర్శి, రామోజీకి వ్యతిరేకంగా స్వర్ణాంధ్ర వేదిక పేరుతో పెద్ద సమావేశం జరిగింది. ఈ సదస్సులో ఉండవల్లితో పాటు సీనియర్ జర్నలిస్టు కేజీబీ తిలక్, హైకోర్టు సీనియర్ లాయర్ ఎస్. సత్యనారాయణ ప్రసాద్ లాంటి వాళ్ళు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడిన వక్తలంతా రామోజీ చీటింగ్‌ను ఖండిస్తూ ఉండవల్లికి మద్దతుగా నిలబడ్డారు. రామోజీ మోసాలను వ్యతిరేకించే వాళ్ళంతా ఏకమై పోరాడకపోతే భవిష్యత్తులో ఆర్థిక‌నేరాలకు పాల్పడే మరిన్ని మాఫియాలు తయారవుతాయని సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. చిట్ ఫండ్ మోసాలకు పాల్పడినట్లు అంగీకరించిన రామోజీని వదిలేసి మోసాలపై పోరాడుతున్న ఉండవల్లిని ఆడిటర్లు, లాయర్లు తప్పుపట్టడమే విచిత్రంగా ఉందన్నారు.

ఉండవల్లి మాట్లాడుతూ మార్గదర్శి చిట్ ఫండ్ వ్యాపారంలో అక్రమాలకు వ్యతిరేకంగా తాను 2006 నుండి పోరాటం చేస్తుంటే ఒక్కరు కూడా తనకు మద్దతుగా నిలబడలేదన్నారు. రామోజీకి తాను వ్యక్తిగతంగా వ్యతిరేకంకాదని అంటూనే ఆయన చేస్తున్న చిట్ ఫండ్ మోసాలను మాత్రమే ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా రామోజీ మోసాలకు వ్యతిరేకంగా సమావేశం జరగటం సంతోషంగా ఉందని ఉండవల్లి అన్నారు. బహుశా ఉండవల్లికి మద్దతుగా మరిన్ని మీటింగులు జరిగే అవకాశముంది. మార్గదర్శికి అనుకూలంగా ఉండవల్లికి వ్యతిరేకంగా సమావేశాలు పెడుతుంటే ఇప్పటికి ఈ మాజీ ఎంపీకి మద్దతుగా సమావేశం జరగటం ఆశ్చర్యంగానే ఉంది.

First Published:  24 April 2023 11:35 AM IST
Next Story