రాజమహేంద్రవరం సీట్ల కోసం తెలుగు తమ్ముళ్ల సిగపట్లు
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ రాష్ట్రంలో 151 సీట్లు గెలుచుకున్నా రాజమహేంద్రవరంలో కాలు మోపలేకపోయింది. సిటీ సీటును దివంగత టీడీపీ లీడర్ ఎర్రంనాయుడి కుమార్తె ఆదిరెడ్డి భవాని, రూరల్ స్థానాన్ని టీడీపీ సీనియర్ లీడర్ గోరంట్ల బుచ్చయ్యచౌదరి గెలుచుకున్నారు.
రాజమహేంద్రవరం నగర, గ్రామీణ నియోజకవర్గాల్లో టికెట్ల కోసం తెలుగు తమ్ముళ్లు సిగపట్లు పడుతున్నారు. రాజమండ్రి రూరల్ సీటును పొత్తులో జనసేనకు ఇస్తారన్న ప్రచారంతో ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి సిటీ సీటుపై కన్నేశారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త వాసు ఈ సీటు కోసం కాచుకుని కూర్చున్నారు. దీంతో గోదావరి తీరాన టీడీపీలో సెగలు పుడుతున్నాయి.
జనసేన ఎఫెక్ట్ పడుతోందా..?
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ రాష్ట్రంలో 151 సీట్లు గెలుచుకున్నా రాజమహేంద్రవరంలో కాలు మోపలేకపోయింది. సిటీ సీటును దివంగత టీడీపీ లీడర్ ఎర్రంనాయుడి కుమార్తె ఆదిరెడ్డి భవాని, రూరల్ స్థానాన్ని టీడీపీ సీనియర్ లీడర్ గోరంట్ల బుచ్చయ్యచౌదరి గెలుచుకున్నారు. కానీ ఈసారి జనసేనతో పొత్తు నేపథ్యంలో రూరల్ సీటును జనసేన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌కు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో బుచ్చయ్య చౌదరి సిటీ సీటువైపు చూడటం ప్రారంభించారు. గత ఎన్నికల్లో తన భార్య ఆదిరెడ్డి భవానిని రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో గెలిపించుకున్న ఆదిరెడ్డి వాసు ఈసారి టికెట్ తనకే వస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు.
ఎవరి నమ్మకం వారిది
పార్టీలో సీనియర్ నేతను, పొలిట్‌బ్యూరో సభ్యుడిని అయిన తనకు సిటీ సీటు అడిగినా ఇస్తారని బుచ్చయ్యచౌదరి ధీమాగా ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయంలోనూ తాను గెలవడం, చంద్రబాబు సామాజికవర్గం నేతను కావడంతో రూరల్ కాకపోతే సిటీ సీటు అయినా ఇస్తారన్నది బుచ్చయ్య ఆశ. మరోవైపు ఆదిరెడ్డి వాసు లెక్కలు తనకున్నాయి. చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు కుటుంబానికి అన్నీ తానై చూసుకున్నారు వాసు. ఆ సందర్భంగా లోకేష్‌తో పెరిగిన సాన్నిహిత్యం, అచ్చెన్నాయుడి అల్లుడిగానే కాక తన తండ్రి ఆదిరెడ్డి అప్పారావుకు స్థానికంగా ఉన్న పలుకుబడి కలిసొచ్చి టికెట్ తనదేనని వాసు ధీమాతో ఉన్నారు. ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేసుకుంటున్నా పైకి మాత్రమే గుంభనంగా ఉన్నారు.