తణుకులో కారాలు మిరియాలు నూరుతున్న టీడీపీ, జనసేన
2024 ఎన్నికల్లోనూ మరోసారి ఆయన టీడీపీ తరఫున పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే జనసేనతో పొత్తు నేపథ్యంలో ఈసారి తన సీటుకు ఎసరు వచ్చే పరిస్థితి కనిపించడంతో ఆయనలోనూ, ఆయన అనుచరుల్లోనూ ఆందోళన నెలకొంది.
పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నేతలు సీటు కోసం పోటీ పడుతున్నారు. రెండు పార్టీల మధ్య ప్రస్తుతం పొత్తు ఖరారు కావడంతో తణుకు నుంచి తానే పోటీ చేస్తున్నానంటూ ఆ పార్టీల నేతలు ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. ప్రస్తుతం తణుకు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున గెలుపొందిన కారుమూరి వెంకట నాగేశ్వరరావు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిసున్నారు. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆయనపై పోటీ చేసి ఓడిపోయారు.
2024 ఎన్నికల్లోనూ మరోసారి ఆయన టీడీపీ తరఫున పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే జనసేనతో పొత్తు నేపథ్యంలో ఈసారి తన సీటుకు ఎసరు వచ్చే పరిస్థితి కనిపించడంతో ఆయనలోనూ, ఆయన అనుచరుల్లోనూ ఆందోళన నెలకొంది. పొత్తులో భాగంగా ఈసారి తణుకు నుంచి పోటీ చేయాలని జనసేన నేత విడివాడ రామచంద్రరావు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. పొత్తు ఖరారు ప్రకటన చేయకముందే.. టీడీపీతో జనసేన పొత్తు ఉంటుందనే క్లారిటీ సర్వత్రా ఉంది. ఆ క్రమంలోనే పవన్ కల్యాణ్ తణుకులో నిర్వహించిన వారాహి సభలో వచ్చే ఎన్నికల్లో తణుకు నుంచి పోటీచేసే అభ్యర్థి విడివాడ రామచంద్రరావే అంటూ బహిరంగంగా ప్రకటించేశారు.
ఆ ప్రకటనతోనే విడివాడ తనకు సీటు గ్యారెంటీ అనే క్లారిటీకి వచ్చేశారు. అదే క్రమంలో ఆయన తణుకు నుంచి పోటీ చేయనున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు. అందుకనుగుణంగా కేడర్‌ను సమాయత్తం చేసుకుంటున్నారు. అయితే పొత్తు ఖరారు కాకముందే.. సీట్ల కేటాయింపుపై ఎలాంటి క్లారిటీ లేకుండానే వన్‌సైడెడ్‌గా పవన్ కల్యాణ్ తన పార్టీ తరఫున అభ్యర్థిని ప్రకటించేయడంపై స్థానిక టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇక ఈ స్థానం నుంచి పోటీచేయడానికి సిద్ధమవుతున్న ఆరిమిల్లి రాధాకృష్ణకైతే పవన్ ప్రకటనతో గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా ఉక్కిరిబిక్కిరి చేసింది.
మరోపక్క చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై విడుదలైన సందర్భంగా తణుకు మీదుగా ఉండవల్లికి వెళ్లారు. ఈ క్రమంలో తణుకు వద్ద ఆగిన సమయంలో జనసేన నేత విడివాడ రామచంద్రరావుతో వ్యవహరించినంత చనువుగా ఆరిమిల్లి రాధాకృష్ణతో చంద్రబాబు వ్యవహరించలేదు. ఈ నేపథ్యంలో జనసేనలో సీటు గ్యారెంటీ అనే ఆశలు రేకెత్తాయి. ఈ క్రమంలో తణుకులో సీటు వ్యవహారం ఇప్పుడు ఆ రెండు పార్టీలూ ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుకునే పరిస్థితికి తెచ్చింది. టీడీపీ నేత ఆరిమిల్లి మాత్రం ఈ విషయంలో తీవ్రంగా స్పందిస్తున్నట్టు సమాచారం. తణుకులో తనకు కాకుండా విడివాడకు సీటిస్తే మాత్రం ఆ పార్టీకి సపోర్ట్ చేసేది లేదని తన కేడర్ వద్ద స్పష్టం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ వ్యవహారం మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచిచూడాలి.