రామాయపట్నం పోర్టుకు భూమిపూజ.. నిర్మాణ సంస్థ ఏదంటే..
నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న రామాయపట్నం పోర్టు తొలిదశ పనులు 3,736 కోట్ల రూపాయలతో పూర్తి చేస్తారు. మొదటి దశ పనులను 36 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఏపీలో పోర్టుల నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. ఐదేళ్లలో నాలుగు పోర్టుల నిర్మాణాన్ని టార్గెట్‌గా పెట్టుకుంది. ఇందులో భాగంగా బుధవారం రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులకు సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేయనున్నారు.
నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న రామాయపట్నం పోర్టు తొలిదశ పనులు 3,736 కోట్ల రూపాయలతో పూర్తి చేస్తారు. మొదటి దశ పనులను 36 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
25 మిలియన్ టన్నుల కార్గో సామర్థ్యంతో మొదటి దశ నిర్మాణం ఉంటుంది. ఒక కోల్ బెర్త్, రెండు కంటెయినర్ బెర్తులు, ఒక మల్టీపర్పస్ బెర్త్‌ను నిర్మించనున్నారు. రెండో దశలో 163 మిలియన్ టన్నుల సామర్థ్యంతో 19 బెర్త్‌లను నిర్మిస్తారు. రామాయపట్నం పోర్టు పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేసుకుంటే.. దేశంలోనే అతి పెద్ద పోర్టుల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది.
పోర్టు దగ్గర 3773 ఎకరాల్లో అతి పెద్ద పారిశ్రామిక కారిడార్ నిర్మాణం జరగనుంది. రైలు కనెక్టివిటీ వస్తుంది. అనుబంధ పరిశ్రమలు భారీగా వచ్చే అవకాశం ఉంది. పోర్టుతో పాటు అక్కడ వచ్చే అనుబంధ పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగా 10 వేల మందికి, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం చెబుతోంది. రామాయపట్నం తొలి దశ నిర్మాణ పనులను నవయుగ, అరబిందో సంస్థల కన్సార్టియం సొంతం చేసుకుంది.
రామాయపట్నం పోర్టే కాకుండా త్వరలోనే 10 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మచిలీపట్నం, భావనపాడు, కాకినాడ గేట్ వే పోర్టు పనులకూ శ్రీకారం చుట్టబోతున్నట్టు ఏపీ ప్రభుత్వం వివరించింది. తీరం వెంబడి ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేక ఒక ఫిషింగ్ హార్బర్ నిర్మాణం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మత్స్యకారులకు లబ్ధి చేకూర్చేలా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి జగన్ ప్రభుత్వం అడుగులేస్తోంది.